చేత్తో తోస్తే నిర్మాణంలో ఉన్న కాలేజీల గోడలు కూలిపోతున్నాయి. ఓ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చేతితో తోయగా కూలుతున్న గోడలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాసిరకం ఇసుక, సిమెంట్ లతో కట్టడం వల్లే.. ఇలా జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీ పాలనలో అవినీతి ఏ స్థాయికి చేరిందో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలని ఎస్పీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సెటైర్లు వేశారు. నాసిరకంగా నిర్మించిన ఆ గోడలు సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆర్కే ముట్టుకోగానే కూలిపోయాయి. స్వయంగా ఆయనే తన ట్విటర్ అకౌంట్ ద్వారా ఈ పోస్టు చేశారు.
ऐसे घटिया निर्माण कार्य से सरकार युवाओं का भविष्य नहीं तैयार रही,यह उनके मौत का इंतजाम है, रानीगंज विधानसभा में बन रहे इंजीनियरिंग कॉलेज में भ्रष्ट सरकारी तंत्र का दर्शन। pic.twitter.com/Rr6ibkN4l4
— Dr. R. K. Verma mla (@DrRKVermamla2) June 23, 2022
వివరాల్లోకి వెళితే ..
యూపీలోని ప్రతాప్ గఢ్ జిల్లా రాణిగంజ్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఓ ప్రాంతంలో యోగి ప్రభుత్వం ఇంజినీరింగ్ కాలేజీని నిర్మిస్తోంది. ఇందుకు దాదాపు రూ. 100 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. ఆ కాలేజీ గోడలు కూడా లేచాయి. నిర్మాణాలను పరిశీలించేందుకు స్థానిక ఎమ్మెల్యే ఆర్కే అక్కడకు వెళ్లి, ఓ గోడను పరిశీలించారు. ఎందుకో అనుమానంతో దానిని చేత్తో తోయగా.. అమాంతం కూలిపోయింది. ఆ తర్వాత మరో గోడను తోయగా.. అది కూడా పడిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో ఆయన పోస్టు చేశారు. యోగి సర్కార్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల నాణ్యత ఇదేనంటూ వీడియోకు కామెంట్ జత చేశారు. దీన్ని చూసిన ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సెటైర్స్ వేశారు. అవినీతి ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు అన్నారు. సిమెంట్ లేకుండా ఇటుకలు పేర్చితే ఇలానే ఉంటుందని వ్యాఖ్యానించారు.
