IND vs AUS: ఆస్ట్రేలియాలో రాణించగల మొనగాడు అతనే: బ్రియాన్ లారా

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత జట్టు నవంబర్ లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ టూర్‌లో ఇరు జట్ల మధ్య నవంబర్ 22 నుంచి ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. గత రెండు పర్యటనల్లో ఆసీస్‌ను సొంత గడ్డపై ఓడించి ట్రోఫీ చేజిక్కించుకున్న టీమిండియా.. ఇప్పుడు మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని వ్యూహాలు రచిస్తోంది. కానీ అదంత తేలికైన విషయం కాదు. ఆసీస్ పేస్ త్రయం కమిన్స్, హేజిల్‌వుడ్, స్టార్క్ భీకర ఫామ్ లో ఉన్నారు. వీరిని ఎదుర్కొని పరుగులు చేయాలంటే భారత బ్యాటర్లు సరికొత్త ప్రణాళికలు అమలు చేయాల్సిందే. 

ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టు బౌలర్లను ఎదుర్కోగల సత్తా, నైపుణ్యం యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్‌కు టన్నుల్లో ఉందని వెస్టిండీస్ మాజీ ఆటగాడు బ్రియాన్ లారా పొగడ్తలు కురిపించాడు. పేస్‌కు అనుకూలించే ఆసీస్ పిచ్ లపై జైస్వాల్‌ కాస్త ఓపిక పడితే తిరుగుండదని తెలిపాడు.

అతని ఆట వేరు.. 

"ఆస్ట్రేలియాపిచ్‌లు భారత్‌కు భిన్నంగా ఉంటాయి. మానసికంగా దృఢంగా ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రదర్శన ఇవ్వొచ్చు.  ఆ మానసికంగా దృఢత్వం జైస్వాల్‌లో కనిపిస్తోంది. అతను నైపుణ్యం గల ఆటగాడు, టెక్నిక్ వేరు. అతని ఆట ఆసీస్ గడ్డపై సరిగ్గా సరిపోతుంది. బాగా రాణిస్తాడని ఆశిస్తున్నాను.." అని లారా అన్నారు.

ALSO READ | IND vs NZ 2024: తొలి టెస్టుకు రోహిత్, విలియంసన్ దూరం..? కారణమిదే..!

లారా మాటల్లో వాస్తవం లేకపోలేదు. ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో జైస్వాల్ పరుగుల వరద పారించాడు. ఇంగ్లాండ్ పేసర్లను ధీటుగా ఎదుర్కొని ఐదు టెస్టుల్లో 89 సగటుతో 712 పరుగులు చేశాడు.

2023లో వెస్టిండీస్‌పై టెస్టు అరంగేట్రం చేసిన జైస్వాల్.. సుధీర్ఘ ఫార్మాట్‌లోనూ ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకూ 11 టెస్టుల్లో  64.05 సగటుతో 1217 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి.