Pakistan Cricket: ఈ జట్టును నడిపించలేను.. కెప్టెన్సీ నుంచి వైదొలిగిన బాబర్ ఆజం

పాకిస్థాన్ క్రికెట్‌లో అనూహ్య పరిణామాలు కొత్తేమీ కాదు.. ఎప్పుడూ చోటుచేసుకునేవే. ఏరోజు ఎవరు తప్పుకుంటారో ఎవరూ ఊహించలేం. పీసీబీ చైర్మన్ సహా ఆ జట్టు కోచ్‌లు, కెప్టెన్లు రాజీనామా చేస్తూనే ఉంటారు. తాజాగా, ఎదురవుతున్న ఓటములు భరించలేక ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలిగాడు. ఈ మేరకు అభిమానులను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ పోస్టును పంచుకున్నాడు.

సొంతగడ్డపై బంగ్లా చేతిలో ఓటమి

సిరీస్ ఏదైనా.. ప్రత్యర్థి జట్టు ఎవరైనా.. పాకిస్థాన్ జట్టుకు ఓటములే ఎదురవుతున్నాయి. ఆఖరికి సొంతగడ్డపైనా అదే పరిస్థితి. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-0తో కోల్పోయింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. మూడు విభాగాల్లోనూ ఆ జట్టు ఆటగాళ్లు తేలిపోతున్నారు. దాంతో అభిమానులు, మాజీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బాబర్ ఆజాం కఠిన నిర్ణయం తీసుకున్నాడు. పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. తన నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో తిరిగి కెప్టెన్‌గా నియమితుడైన బాబర్.. ఐదు నెలలకే బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. తన నిర్ణయాన్ని గత నెలలోనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి), టీమ్ మేనేజ్‌మెంట్‌కు తెలియజేసినట్లు ప్రకటనలో బాబర్ ధృవీకరించాడు.

ALSO READ | IND vs BAN 2nd Test: వందకు ఆలౌటైనా ఫర్వాలేదు: రోహిత్‌‌

నాయకత్వం వహించడం గౌరవం

"ఈ(పాకిస్థాన్) జట్టుకు నాయకత్వం వహించడం చాలా గౌరవంగా ఉంది. కానీ నేనిప్పుడు కెప్టెన్సీ నుంచి వైదొలిగి నా పాత్రపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది.. " అని బాబర్ మంగళవారం (అక్టోబర్ 1) అర్థరాత్రి ఎక్స్ లో పోస్ట్ చేశాడు.

బాబర్ ఆజం రాజీనామా నేపథ్యంలో పాకిస్థాన్ తదుపరి కెప్టెన్‌గా మహమ్మద్ రిజ్వాన్‌ను ఎంపిక చేయవచ్చని నివేదికలు వెల్లడిస్తున్నాయి.