ఈనెల 17 వరకు సర్వ దర్శనం కోటా టికెట్లు జారీ చేసిన టిటిడి
నిరాశతో వెను తిరుగుతున్న వెంకన్న భక్తులు
తిరుపతి: ఏడుకొండల వాడి ఉచిత దర్శన టికెట్ల జారీని అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. కరోనా లాక్ డౌన్ నిబంధనల మేరకు ప్రతి రోజు 3,750 మందికి ఉచిత దర్శనం టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించగా.. భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో భక్తులను నిరాశకు గురిచేయకూడదని నిర్ణయించిన దేవస్థానం ఈనెల 17వ తేదీ వరకు ఉన్న కోటా ఉచిత దర్శన టోకెన్లన్నీ జారీ చేసింది. అయితే రోజు రోజుకూ భక్తుల రాక పెరుగుతూనే ఉండడంతో రద్దీని నివారించేందుకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. 10 సంవత్సరాల పిల్లలకు 65 ఏళ్ళ పైబడిన వారికి దర్శనాలు రద్దు చేసింది. అయితే ఎంత ఆలస్యమైనా సరే దర్శనం చేసుకోవాలని.. మొక్కుబడి చెల్లించుకోవాలని ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చిన భక్తులు కౌంటర్ల మూసివేతతో నిరాశకు గురయ్యారు.
హైదరాబాదు నుండి వచ్చాం.. పిల్లవాడికి పుట్టు వెంట్రుకలు ఇవ్వాలి అనుకున్నాం.. మా పరిస్థితి ఏమిటి అంటూ.. ? అంటూ కొందరు కౌంటర్ల దగ్గర సిబ్బందితో వాగ్వాదం చేసి కంట తడిపెట్టుకున్నారు. శ్రీనివాసం, విష్ణు నివాసం, అలిపిరి బాలాజీ బస్టాండ్ కౌంటర్లకు భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు నిరాశతో వెళ్ళిపోయారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ టికెట్ కౌంటర్ దగ్గర పలువురు మహిళలు కన్నీరు పెట్టుకున్నారు. రూ.800 బస్సు టికెట్ పెట్డుకుని పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుండి దర్శనానికి వచ్చానని, టికెట్లు లేవంటున్నారని ఓ వృద్ధురాలు కంటతడిపెట్టుకుని ఆవేధన వ్యక్తం చేసింది.

