ఆమరణ దీక్షకు మద్దతివ్వండి.. రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్​ను కోరిన ప్రశాంత్ కిశోర్​

  • బీపీఎస్సీ పేపర్లు లీకయ్యాయంటూ జన్​సురాజ్ పార్టీ చీఫ్ ఆరోపణలు

పట్నా: బిహార్ ​పబ్లిక్ సర్వీస్ ​కమిషన్​(బీపీఎస్సీ) నిర్వహించిన పరీక్షను రద్దు చేయాలంటూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రశాంత్‌‌ కిశోర్‌‌.. కాంగ్రెస్‌‌ అగ్రనేత రాహుల్‌‌ గాంధీ, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ సపోర్ట్ ఇవ్వాలని కోరారు. గతేడాది డిసెంబర్ 13న బీపీఎస్సీ నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ 70వ కంబైన్డ్ (ప్రిలిమినరీ) పరీక్ష పేపర్లు లీకయ్యాయంటూ పట్నాలోని గాంధీ మైదానంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నాలుగు రోజులుగా కిశోర్ ‘అమ్రాన్ అన్షాన్’ దీక్ష చేస్తున్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ దీక్ష విషయంలో రాహుల్, తేజస్వీ నాయకులను ఫాలో అవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఒకవేళ వారు తనతో కలవడానికి సిద్ధంగా లేకపోతే తాను విత్​డ్రా అవుతానని అన్నారు.

‘‘ఈ ఆందోళన రాజకీయాలకు అతీతమైంది. నా పార్టీ బ్యానర్‌‌ కింద దీన్ని నిర్వహించడం లేదు. యవకులు నిన్న రాత్రి 51 మందితో కూడిన ‘యువ సత్యాగ్రహ సమితి’ (వైఎస్‌‌ఎస్‌‌) అనే ఫోరమ్‌‌ ఏర్పాటు చేశారు. 100 మంది ఎంపీలు ఉన్న రాహుల్ గాంధీ, రాష్ట్రంలో 70 కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న తేజస్వీ యాదవ్ మద్దతు ఇవ్వాలని స్వాగతం పలుకుతున్నం” అని అన్నారు.

‘‘ఆ ఇద్దరు మన కంటే చాలా పెద్ద నాయకులు. వారు ఈ గాంధీ మైదాన్‌‌లో ఐదు లక్షల మందిని గ్యాదర్ చేయగలరు. అలా చేయవలసిన సమయం ఇది. యువత భవిష్యత్తు ప్రమాదంలో పడింది. మనం క్రూరమైన పాలనను ఎదుర్కొంటున్నం. ఈ ప్రభుత్వం గత మూడేళ్లలో ప్రజలపై 87 సార్లు లాఠీ చార్జ్ చేసింది” అని అన్నారు.