సిద్దిపేట రూరల్, వెలుగు: ఆర్టీసీ బస్సులో నుంచి తప్పిపోయిన బాలుడిని అతడి తల్లిదండ్రులకు సిద్ధిపేట పోలీసులు అప్పగించారు. కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ మల్లేశం గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం సిరిసిల్ల నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులో ఉమా, పీటర్ దంపతులు తమ కొడుకు బెన్హర్ తో కలసి వెళుతున్నాడు. శనివారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో సిద్దిపేట ఓల్డ్ బస్టాండ్ లో బస్సు ఆగిన సమయంలో బాలుడు బస్సు దిగుతున్న మరో మహిళను తన తల్లిగా భావించి, ఆ మహిళ వెనకే వెళ్లి కిందికి దిగిపోయాడు.
అది చూసుకోని తల్లిదండ్రులు బస్సులో వెళ్లిపోగా, పిల్లవాడు ఆ మహిళ దగ్గర ఏడ్వడంతో పక్కనే ఉన్న ఆటో డ్రైవర్ డయల్100 కు కాల్ చేసి విషయం తెలిపాడు. కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్రమత్తమై వెంటనే ఆ మహిళ వద్ద ఉన్న టికెట్స్ ఆధారంగా, బస్సును కనుక్కొని కుకునూరుపల్లి వద్ద బస్సును ఆపి, వారిని సిద్దిపేట ఓల్డ్ బస్టాండ్ వద్దకు రప్పించి అబ్బాయిని తల్లిదండ్రులకు అప్పగించినట్లు తెలిపారు. బాబును క్షేమంగా అప్పగించిన విషయం తెలుసుకొని సీపీ. డాక్టర్ బి. అనురాధ కంట్రోల్ రూమ్ సిబ్బందిని అభినందించారు. త్వరలో రివార్డు అందజేస్తామని తెలిపారు.