ఈతకు వెళ్లి బాలుడు మృతి

అయిజ, వెలుగు: గద్వాల జిల్లా అయిజ మండలం ముగోనిపల్లిలో ఈతకు వెళ్లిన బాలుడు నీట మునిగి చనిపోయాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముగోనిపల్లి గ్రామానికి చెందిన రైతు మీర్జాపురం కుర్వ ఆంజనేయులు కుమారుడు నరేశ్ (11) స్నేహితులతో కలిసి వ్యవసాయ బావి వద్దకు ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఒడ్డు పై నుంచి బావిలో దూకగా.. నాచు ఇరుక్కుని మునిగిపోయాడు. 

గమనించిన స్నేహితులు కుటుంబ సభ్యులు, గ్రామస్థులకు సమాచారం అందించడంతో బాలుడి డెడ్‌‌‌‌‌‌‌‌బాడీని బావి నుంచి బయటకు తీశారు. బాలుడు సమీప గ్రామం భూంపురంలోని ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు.  బాలుడి మృతితో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.