సీఎం జగన్ చేతిలో బోస్టన్ కమిటీ రిపోర్ట్.. ఇందులో ఏముంది..?

సీఎం జగన్  చేతిలో బోస్టన్ కమిటీ రిపోర్ట్.. ఇందులో ఏముంది..?

అమరావతి, వెలుగు ఆంధ్రా అభివృద్ధి, రాజధానులపై నియమించిన బోస్టన్ కమిటీ ఏపీ సీఎం జగన్ కు తుది నివేదిక ఇచ్చింది. రాష్ర్టాన్ని 6 రీజియన్లుగా విభజించి అభివృద్ధి వికేంద్రీకరణకు చర్యలు తీసుకోవాలని సూచించింది. 13 జిల్లాల్లో లభ్యమయ్యే వనరులు, అవకాశాలు ప్రాతిపదికగా స్టడీ చేసినట్లు కమిటీ సభ్యులు సీఎం జగన్ కు వివరించారు. శుక్రవారం అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో బోస్టన్ కమిటీ సీఎం జగన్ నివేదిక అందించింది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ రాష్ర్టంలోని 13 జిల్లాలను ఉత్తరాంధ్ర (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం), గోదావరి డెల్టా (తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి), కృష్ణా డెల్టా (కృష్ణా, గుంటూరు), సౌత్ ఆంధ్రా (నెల్లూరు, ప్రకాశం), ఈస్ట్‌‌ రాయలసీమ (చిత్తూరు,కడప) వెస్ట్‌‌ రాయలసీమ (కర్నూలు, అనంతపురం)గా విభజించాలని కమిటీ సూచించింది.

అమరావతి పెనుభారం..

అమరావతి నిర్మాణం పెనుభారంగా మారనుందని కమిటీ రిపోర్ట్ లో వెల్లడించింది. అమరావతిపై పెట్టే రూ.లక్ష కోట్లను నీటి పారుదల ప్రాజెక్టులపై ఖర్చు చేస్తే 4 ఏళ్లలోనే అద్భుతమైన ఫలితాలు వస్తాయని సూచించింది. అమరావతి, విజయవాడలో మౌలిక వసతులను వాడుకోవాలి. ప్రజలతో నేరుగా సంబంధముండే ఆఫీసులు, అసెంబ్లీ, హైకోర్ట్ బెంచ్ ఉండాలి. విశాఖలో రాజ్ భవన్, సెక్రటేరియట్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి. కర్నూలులో హైకోర్టు, కమిషనరేట్లు, అప్పిలేట్ అథారిటీలు ఏర్పాటు చేయాలని బోస్టన్ కమిటీ సూచించింది.

1.వెస్ట్ రాయలసీమ: కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఆటోమొబైల్‌‌, లాజిస్టిక్‌‌ హబ్‌‌, సోలార్ పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం. ఆటో మోటివ్, ఆటో పార్ట్స్, సర్క్యూట్ టూరిజం ఏర్పాటు చేయాలి. బెంగళూరుకు ప్రత్యామ్యాయంగా అనంతపురం, హైదరాబాద్‌‌కు ప్రత్యామ్నాయంగా కర్నూలును డెవలప్ చేయాలి.

2.ఈస్ట్ రాయలసీమ: చిత్తూరు జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు.  తిరుపతిలో ఎలక్ట్రానిక్‌‌ పరిశ్రమల్ని ఏర్పాటు చేయాలని సూచన. కడపలో స్టీల్ ప్లాంట్, మినరల్, ఎలక్ట్రానిక్, హైటెక్ హార్టికల్చర్, ఎకో టూరిజం, బెలూన్ కేవ్, గండికోటను టూరిజం సర్య్కూట్​గా అభివృద్ధి చేయాలి.

3.సౌత్ ఆంధ్రా: నెల్లూరులో చేపలు, రొయ్యల ఉత్పిత్తి పరిశ్రమలు. ప్రకాశం జిల్లాలో ఖనిజ, అటవీ ఆధారిత పరిశ్రమలకు అవకాశం. ఆటోమోటివ్, ఆటో పార్ట్స్, టెలికాం ఎక్విప్‌‌మెంట్, లెదర్, పేపర్, ఫర్నిచర్, ఫిషరీస్ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి.

4.కృష్ణా డెల్టా: కృష్ణా, గుంటూరు జిల్లాలను ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దాలి. బందరు పోర్టు, మైపాడు బీచ్ ల అభివృద్ధి చేయాలి. ఫుడ్ ఫిషరీస్ ప్రాసెసింగ్, సిరామిక్స్, మల్టీ మోడల్ లాజిస్టిక్ హబ్స్, హైటెక్ ఆర్గానిక్ ప్రాసెసింగ్ ఏర్పాటు.

5.గోదావరి డెల్టా: గోదావరి డెల్టాలో పెట్రో కెమికల్స్, ప్లాస్టిక్‌‌, గ్యాస్‌‌ పరిశ్రమలు పెట్టాలి. బ్యాక్ వాటర్ టూరిజం అభివృద్ధితో ఆదాయం. పోలవరం ప్రాజెక్టు, వాటర్‌‌ గ్రిడ్‌‌, రోడ్‌‌ గ్రిడ్‌‌ అభివృద్ధితో మెరుగైన ఫలితాలు. సోలార్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, హార్టికల్చర్, క్రాస్ క్రాప్స్, కోనసీమ హోప్ ఐలాండ్ అభివృద్ధి చేయాలి.

6.ఉత్తరాంధ్ర జోన్: మెడికల్ హబ్‌‌గా అభివృద్ధి చేయొచ్చు. కాఫీ, పసుపు, జీడిపప్పు పరిశ్రమలకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు అనుకూలం.   ఎనలిటిక్స్ అండ్ డేటా హబ్, మెడికల్ సర్వీసులు, టాయ్స్ ఇండస్ట్రీస్, హెల్త్, టూరిజం, ఎకో టూరిజం, వెడ్డింగ్, అడ్వెంచర్ టూరిజం.