బొర్ర పెరుమాండ్లు గుడి..ఎక్కడుందో తెలుసా.?


సిద్దిపేట, వెలుగు:  బొజ్జ గణపయ్య తెలుసు, కానీ.. ఈ బొర్ర పెరుమాండ్లు ఎవరు అనేగా మీ డౌటు. బొజ్జ గణపయ్యనే సిద్దిపేటలో బొర్ర పెరుమాండ్లు అని పిలుస్తారు. ఇక్కడ ఆయనకు గుడి కూడా ఉంది. అది ఇప్పటిది కూడా నాలుగు వందల ఏళ్ల నాటిది. ఈ బొర్ర పెరుమాండ్లుకు స్థానిక ప్రజలు ప్రతి రోజూ పూజలు చేస్తున్నారు. పూర్వీకులు చెప్పినదాని ప్రకారం.. సిద్దిపేట పట్టణం ఏర్పాటుకు ముందు ఈ ప్రాంతంలో 'మాతంగి' అనే నది. ప్రవహించేది. ఆ నది ఒడ్డున బొజ్జ గణపతి విగ్రహం, మరికొన్ని దేవతా విగ్రహాలు ఉండేవి. వాటన్నింటినీ స్థానికులు ఒకే చోటకు తీసుకొచ్చారు.తర్వాత ఒక ఆలయం కట్టించి అందులో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఆలయాన్ని 'బొర్ర పెరుమాండ్లు' గుడిగా పిలుస్తున్నారు భక్తులు.


సాధారణంగా అన్ని వినాయక విగ్రహాలకు తొండం ఎడమవైపు ఉంటుంది. కానీ.. ఈ విగ్రహానికి మాత్రం కుడి వైపు ఉంటుంది. అంతేకాదు ఈ విగ్రహం నల్లరాయితో చెక్కారు. ఆలయ ముఖ ద్వారాన్ని దక్షిణాభిముఖంగా ఏర్పాటు చేసి, దానికి ఎదురుగా రాతి ధ్వజస్తంభాన్ని నిలిపారు. గర్భగుడిలో బొజ్జ గణపయ్య మాత్రం పశ్చిమాభి ముఖంగా ఉంటాడు. ఇదే గర్భగుడిలో ఆంజనేయ స్వామి, శివలింగం, నంది విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ వినాయకుడి విగ్రహాన్ని పరిశీలించిన
కొందరు చరిత్రకారులు వినాయక విగ్రహం కాకతీయల కాలానికి పూర్వం నాటిదిగా చెప్పారు. కానీ.. ఇందుకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు దొరకలేదు.