బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో టీమిండియా ప్రాక్టీస్ సెషన్లకు ఇకపై అభిమానులు రాకుండా నిషేధం విధించారు. మంగళవారం ఓపెన్ నెట్ ప్రాక్టీస్ సెషన్ కు ఫ్యాన్స్‌ను అనుమతించారు. ఆసీస్ ప్రాక్టీస్ చేసిననప్పుడు వంద మంది కూడా రాలేదు. కానీ, టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌కు దాదాపు 3000 వేల మంది వచ్చారు. ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసే నెట్స్ కు చాలా దగ్గర్లో నిల్చున్నారు. తమ అరుపులు, కేకలతో ప్లేయర్లను ఇబ్బంది పెట్టారు.
వారిలో కొందరు పరుష, అసభ్య పదాలు కూడా వాడారని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. రోహిత్, పంత్‌ను సిక్సర్లు కొట్టాలంటూ ఒత్తిడి తెచ్చారు. ఫ్యాట్‌గా ఉన్నావంటూ ఓ ప్లేయర్‌ను కొందరు వెక్కిరించారు. ఓ అభిమాని నెట్ సెషన్‌ను ఫేస్‌బుక్ లైవ్‌లో పెట్టాడు. దాంతో ఇకపై ఇండియా ప్రాక్టీస్ సెషన్లకు రాకుండా ఫ్యాన్స్‌ను బ్యాన్ చేయాలని నిర్ణయించారు.
పింక్ టెస్టులో ‘స్పిన్ బాల్’
ఆస్ట్రేలియా–ఇండియా మధ్య పింక్ బాల్ టెస్టులో స్పిన్నర్లు ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఈ మ్యాచ్ కోసం ఉపయోగించే వికెట్‌పై 6 మిల్లీమీటర్ల పచ్చిక ఉంటుందని అడిలైడ్ గ్రౌండ్ క్యూరేటర్ డామిన్ హో చెబుతున్నాడు. ఈ పచ్చిక పేసర్లకు అనుకూలిస్తుందంటూనే.. మ్యాచ్ ముందుకెళ్లేకొద్దీ స్పిన్నర్లు కూడా ప్రభావం చూపగలరని తెలిపాడు. దాంతో ఇరు జట్లూ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే ఆలోచన చేయొచ్చు.