ఇవాళ (డిసెంబర్ 12) నుంచి హైదరాబాద్​ బుక్ ఫెయిర్

ముషీరాబాద్, వెలుగు : హైదరాబాద్ బుక్ ఫెయిర్ గురువారం నుంచి ఈ నెల 29 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు బుక్ ఫెయిర్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ యాకూబ్, ఆర్ శ్రీనివాస్ తెలిపారు. సాయంత్రం 5 గంటలకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ హాజరై, బుక్ ఫెయిర్ ప్రారంభిస్తారని చెప్పారు. ఈ మేరకు బుధవారం యాకూబ్,  శ్రీనివాస్ ఎన్టీఆర్ స్టేడియంలో  ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ..10 రోజులపాటు కొనసాగే బుక్ ఫెయిర్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. 

సుమారు 350 స్టాల్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 210 మందికి పైగా ఉన్న ప్రచురణకర్తలు, డిస్ట్రిబ్యూటర్లు పుస్తకాలను బుక్ ఫెయిర్ లో ప్రదర్శిస్తారని వివరించారు. ఈ పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి దాశరథి కృష్ణమాచార్య, సభ కార్యక్రమాల వేదికకు బోయి విజయ భారతి, పుస్తకాల ఆవిష్కరణ వేదికకు తోపుడు బండి సాదిక్ పేర్లు పెట్టామని చెప్పారు. అంతేకాకుండా పుస్తక ప్రియులకు తెలంగాణ రుచులతో ఫుడ్ స్టాల్స్, పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు.