ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతుల్లో బోనస్ సంబురం

  • సన్నవడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున చెల్లింపు
  • ఉమ్మడి జిల్లాలో 12 లక్షల క్వింటాళ్లకుపైగా సన్నాల కొనుగోలు 
  • రైతుల ఖాతాల్లో రూ.60 కోట్లు జమ

కరీంనగర్, వెలుగు: ఉమ్మడి జిల్లాలో సన్నాలు పండించిన రైతుల కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాలుకు బోనస్ రూ.500 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుండడంతో లబ్ధిపొందిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లా పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో శుక్రవారం వరకు సుమారు 12 లక్షల క్వింటాళ్లకు పైగా సన్నరకం వడ్లు కొనుగోలు చేయగా.. ఇందుకు సంబంధించి రైతుల ఖాతాల్లో రూ.60 కోట్ల బోనస్ జమ చేశారు. రైతుబంధు సాయంతో పోలిస్తే.. బోనస్ మొత్తం ఎక్కువగా వచ్చిందని పలువురు రైతులు ఆనందం వ్యక్తం చేశారు. 

పెద్దపల్లి జిల్లాలో అత్యధికం..

కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాలకు బోనస్ ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలో సన్న రకం వడ్ల సాగు విస్తీర్ణం అమాంతం పెరిగింది. ఈ వానాకాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో 3 లక్షల ఎకరాలకుపైగా సన్న వడ్లు పండించారు. ఇందులో కొందరు మిల్లర్లకు అమ్ముకోగా మరికొందరు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్మారు. ఇలా పెద్దపల్లి జిల్లాలో శుక్రవారం వరకు అత్యధికంగా 10,107 మంది రైతులు 7.24 లక్షల క్వింటాళ్ల సన్న ధాన్యం అమ్మగా వారి ఖాతాల్లో బోనస్ మొత్తం రూ.30.24 కోట్లు జమయింది.

కరీంనగర్ జిల్లాలో 4,880 మంది రైతులు సుమారు 4 లక్షల క్వింటాళ్ల సన్న ధాన్యం అమ్మగా వారి ఖాతాల్లో రూ.20 కోట్ల బోనస్ డబ్బులు జమ అయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 595 మంది రైతులు 46124 క్వింటాళ్లు విక్రయించగా వారికి రూ.2.30 కోట్ల బోనస్ పడింది. జగిత్యాల జిల్లాలో 172 మంది రైతులకు చెందిన 2,148 మెట్రిక్ టన్నుల ధాన్యానికి రూ. 1.07 కోట్ల బోనస్ జమ ​అయింది. 

82  క్వింటాళ్లకు రూ.41 వేల బోనస్ పడింది

సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో నాకు జమ్మికుంట మండలం శాయంపేటలో ఉన్న మూడెకరాల్లో సన్నరకం వడ్లు సాగు చేసిన. మా ఇంట్లో బియ్యానికి దాచుకున్న వడ్లు పోనూ 82 క్వింటాళ్ల వడ్లు స్థానిక ధాన్యం కొనుగోలు కేంద్రంలో అమ్మిన. నాకు రూ.41 వేల బోనస్ జమ కావడం సంతోషంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. =పోల్సాని సంపత్ రావు, శాయంపేట(జమ్మికుంట)

లక్ష బోనస్ జమయింది..

వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో నాకున్న 15 ఎకరాల్లో సగానికి ఎక్కువ సన్నరకం వడ్లు పండించిన.216.800 క్వింటాళ్ల సన్న వడ్లను ధాన్యం కొనుగోలు కేంద్రంలో అమ్మితే 1,08,400 బోనస్ జమ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట
నిలబెట్టుకుంది. - గొట్టుముక్కల వెంగల్ రావు, బేతిగల్ (వీణవంక)

82 క్వింటాళ్లకు 41 వేల బోనస్ పడింది

సన్న వడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో నాకు జమ్మికుంట మండలం శాయంపేటలో ఉన్న మూడెకరాల్లో సన్నరకం వడ్లు సాగు చేసిన. మా ఇంట్లో బియ్యానికి దాచుకున్న వడ్లు పోనూ 82 క్వింటాళ్ల వడ్లు స్థానిక ధాన్యం కొనుగోలు కేంద్రంలో అమ్మిన. నాకు రూ.41 వేల బోనస్ జమ కావడం సంతోషంగా ఉంది.-పోల్సాని సంపత్ రావు, శాయంపేట(జమ్మికుంట)