పెనుగులాట లేదు..‘రేప్’ జరిగిందంటే ఎట్లా?
బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ కామెంట్
రేప్ నిందితుడికి శిక్ష రద్దు చేస్తూ తీర్పు
ముంబై: బాలిక చేతులు కట్టేసి పట్టుకుని, ప్యాంటు జిప్ తెరిచినా పోక్సో చట్టం కింద నేరం కాదని, బట్టలపైనుంచి అమ్మాయిల ప్రైవేటు భాగాలను తాకితే నేరంగా పరిగణించలేమని తీర్పులు చెప్పిన బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ తాజాగా మరో సంచలన కామెంట్ చేసింది. పెనుగులాట జరక్కుండా ఓ అమ్మాయి నోటిని మూసి, బట్టలు తొలగించి, రేప్ చేయడం ఒక వ్యక్తికి అస్సలు సాధ్యమయ్యే పనికాదని ఓ కేసు విషయంలో వెల్లడించింది. పైగా మెడికల్ ఎవిడెన్స్ కూడా కేసుకు బలాన్ని ఇవ్వలేదంది. ఈ మేరకు నిందితుడికి కింది కోర్టు వేసిన శిక్షను జస్టిస్ పుష్ప గనేడివాలా ఆధ్వర్యంలోని
బెంచ్ రద్దు చేసింది.
అసలు కేసేంటి?
పొరుగింటి వ్యక్తి సూరజ్ కసర్కర్ తన కూతురుపై అత్యాచారం చేశాడని 2013 జులై 26న బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతురుకు 15 ఏళ్లు ఉన్నప్పుడు నిందితుడు ఈ దారుణం చేశాడంది. ఆ ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిపై చార్జ్‌షీట్ తెరిచారు. బాధితురాలికి 18ఏళ్ల కంటే ఎక్కువే వయస్సుందని, ఆమె సమ్మతంతోనే ఇద్దరూ ఫిజికల్‌గా దగ్గరయ్యారని నిందితుడి తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. మరోవైపు బాధితురాలిపై బలవంతంగానే నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె తరపు లాయర్ వాదించారు. ఆమె ఇంట్లోకి చొరబడి రేప్ చేశాడన్నారు.
బాధితురాలు ఏం చెప్పింది?
‘రాత్రి 9.30 గంటల టైమ్‌లో నిందితుడు బాధితురాలి ఇంట్లోకి వచ్చాడు. ఆ టైమ్‌లో అతడు తాగి ఉన్నాడు. బాధితురాలు మంచంపై పడుకొని ఉండగా ఆమె బ్రదర్ కింద పడుకున్నాడు. తల్లి ఇంట్లో లేదు. నిందితుడు అమ్మాయి దగ్గరకు వచ్చినోరు నొక్కి తన బట్టలు, తర్వాత ఆమె బట్టలు విప్పి రేప్ చేశాడు. ఆ తర్వాత తన బట్టలు తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు’ అని బాధితురాలు వివరించినట్టు కోర్టుకు లాయర్ తెలిపారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తల్లికి బాధితురాలు విషయం చెప్పడంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు పెట్టారన్నారు.
కోర్టు ఏమంది?
రేప్ జరిగిన టైమ్‌లో బాధితురాలి వయసు 18 ఏండ్ల లోపేనని బర్త్ సర్టిఫికెట్, మెడికల్ ఎవిడెన్స్ ద్వారా ప్రూవ్ చేయలేకపోయారని కోర్టు పేర్కొంది. కేవలం బాధితురాలు చెప్పే విషయాన్ని కోర్టు విశ్వసించలేదని చెప్పింది. ‘బలవంతంగా రేప్ చేసి ఉంటే గొడవ, పెనుగులాట జరిగి ఉండేది. కానీ గాయాలైనట్టు మెడికల్ రిపోర్టులో పేర్కొనలేదు. ఏకాభిప్రాయంతోనే జరిగినట్టు తెలుస్తోంది. తన తల్లి రాకుంటే కంప్లైంట్ ఇచ్చేదాన్ని కాదని బాధితురాలు చెప్పిందని కూడా గుర్తుచేసింది’ అని కోర్టు పేర్కొంది. ఈ కేసులో నిందితుడికి ట్రయల్ కోర్టు వేసిన 10 ఏండ్ల శిక్షను రద్దు చేసింది.
