తిరుపతిలోని హోటల్స్ కు బాంబు బెదిరింపులు : పాక్ ISI పేరుతో మెయిల్స్

ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన తిరుపతి నగరంలో అర్థరాత్రి అలజడి.. పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదుల పేరుతో తిరుపతి నగరంలోని కొన్ని హోటల్స్ కు ఈ మెయిల్స్ వచ్చాయి. మీ హోటల్ లో బాంబులు పెట్టాం.. అర్థరాత్రి పేలిపోతాయి.. వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోండి అంటూ ఆ మెయిల్స్ లో ఉంది. దీంతో హోటల్ యజమానులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

తిరుపతి నగరంలోని లీలామహల్ సెంటర్ లోని మూడు ప్రముఖ ప్రైవేట్ హోటల్స్, రామానుజ సర్కిల్ లోని మరో ప్రైవేట్ హోటల్ కు ఈ బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఈ సమాచారంలో సిటీలోని పోలీసులు అందరూ ఉరుకులు పరుగులు పెట్టారు. 2024, అక్టోబర్ 24వ తేదీ అర్థరాత్రి నుంచి 25వ తేదీ ఉదయం వరకు అన్ని హోటల్స్ ను తనిఖీ చేశారు పోలీసులు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ లు హోటల్స్ లోని ప్రతి గదిని తనిఖీ చేశారు. ఆయా హోటల్స్ లో ఉన్న భక్తులు, పర్యాటకులను విచారించారు. ఎలాంటి బాంబులు లేవని నిర్థారించుకున్న తర్వాతే మళ్లీ భక్తులను హోటల్స్ లోకి అనుమతించారు పోలీసులు.

Also Read:-హైదరాబాద్ విమానం జైపూర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఇంతకీ బాంబు బెదిరింపులకు కారణం ఏంటో తెలుసా.. పాకిస్తాన్ టెర్రరిస్ట్ జాఫర్ సాదిక్​కు జైలు శిక్షపై ఉగ్రవాదులు ఈ విధంగా చేశారు. ఉగ్రవాది జాఫర్ సాదిక్ కు శిక్ష పడే విధంగా తమిళనాడు ప్రభుత్వం సహకరించటం నచ్చలేదంటూ ఈ బెదిరింపులకు దిగారు. తిరుపతిలోని పుణ్యక్షేత్రాలను కూడా టార్గెట్ చేసినట్లు ఈ మెయిల్ లో ఉండటం కలకలం రేపుతోంది. నిత్యం లక్షల మంది భక్తులు వచ్చే తిరుపతి పుణ్యక్షేత్రంపై టెర్రరిస్టులు టార్గెట్ చేయటంతో.. పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. సెక్యూరిటీని పెంచారు. భద్రతను సమీక్షిస్తు్న్నారు ఉన్నతాధికారులు.