సిలిండర్  ధరను మూడురెట్లు పెంచినోళ్లు ఫ్రీగా ఇస్తరా?: కాంగ్రెస్

సిలిండర్  ధరను మూడురెట్లు పెంచినోళ్లు ఫ్రీగా ఇస్తరా?: కాంగ్రెస్
  •   బీజేపీది ఝూట్ లూట్  మ్యానిఫెస్టో: కాంగ్రెస్
  •    సిలిండర్  ధరను మూడురెట్లు పెంచినోళ్లు ఫ్రీగా ఇస్తరా?
  •    గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో పది శాతమే నెరవేర్చిందని ఫైర్

న్యూఢిల్లీ: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ రిలీజ్​ చేసిన మేనిఫెస్టోపై కాంగ్రెస్  పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ఆ మేనిఫెస్టో అంతా బోగస్, ఝూట్ లూట్(అబద్ధాలు చెప్పి లూటీ చేయడం) అని మండిపడింది. ఈ ఎన్నికల్లో బీజేపీని ఓటర్లు తిరస్కరిస్తారని పేర్కొంది. సిలిండర్  ధరను మూడు రెట్లు పెంచినోళ్లు ఏడాదికి 3 సిలిండర్లు ఎలా ఇస్తారని ఏఐసీసీ జనరల్  సెక్రటరీ(కర్నాటక) రణ్​దీప్  సుర్జేవాలా ట్విటర్ లో ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే యూనిఫాం సివిల్​కోడ్, ఎన్ఆర్సీ అమలు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని మండిపడ్డారు. ‘‘2018 మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీల్లో బీజేపీ ప్రభుత్వం కేవలం 10 శాతమే నెరవేర్చింది. బొమ్మై సర్కారు అన్ని పనుల్లోనూ 40% కమీషన్  తీసుకుంది” అని సుర్జేవాలా వ్యాఖ్యానించారు. తొమ్మిదేండ్ల పాలనలో మోడీ సర్కారు ఎల్పీజీ సిలిండర్​ ధరను మూడురెట్లు పెంచిందని కాంగ్రెస్ పార్టీ మరో ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్​ ట్వీట్​ చేశారు. ‘‘యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఈ రోజు కర్నాటకలో 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తామంటున్నారు. వారు చెప్పేదంతా అబద్ధం. పెరిగిన ధరలతో బీజేపీ పాలనపై ప్రజలు విసిగెత్తిపోయారు” అని జైరాం పేర్కొన్నారు. నందిని డెయిరీని అమూల్​లో విలీనం చేయడానికి ప్రయత్నించిన వాళ్లు రోజూ అర లీటర్​ పాలు ఉచితంగా ఇస్తామంటే నమ్మేదెలా అని జైరాం రమేశ్​ ప్రశ్నించారు.

ఇందిరా క్యాంటీన్లకు కొత్త పేర్లు పెట్టి తెరుస్తరా?

తమ పార్టీ అధికారంలో ఉన్నపుడు ఇందిరా క్యాంటీన్లు నడిపిందని జైరాం రమేశ్  తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ క్యాంటీన్లను బంద్  చేసి ఇపుడు పేరుమార్చి మళ్లీ అవే క్యాంటీన్లను ఓపెన్  చేయాలని చూస్తోందని ఆరోపించారు. అలాగే బెంగళూరు బ్రాండ్ ఇమేజీని బొమ్మై సర్కారు నాశనంచేసిందని, ఇపుడు ‘స్టేట్  క్యాపిటల్  రీజియన్’ పేరుతో కొత్త నాటకం ఆడుతోందని ఆయన విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం 10% హామీలను నెరవేరిస్తే, 2013–18 సమయంలో తమ ప్రభుత్వం 95% హామీలను నెరవేర్చిందని చెప్పారు. ఈ సారి ప్రజలు బీజేపీని ఓడించి తమకు అధికారం అప్పగిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.