మధ్యప్రదేశ్లోని ఓ ప్రభుత్వాస్పత్రిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఓ చిన్నారి మృతదేహాన్ని భుజాలపై మోసుకుంటూ స్వగ్రామానికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఛతర్‌పూర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి చనిపోయింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. కానీ పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ లు అందుబాటులో లేవు. ప్రైవేటు అంబులెన్స్లో తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులకు చేతిలో చిల్లిగవ్వ లేదు. దీంతో చేసేదేంలేక బాలిక మేనమామ నాలుగేండ్ల మేనకోడలిని భుజాన వేసుకుని కాలినడకన స్వగ్రామానికి బయలుదేరాడు.
చిన్నారి మృతదేహాన్ని భుజాన మోసుకుంటూ వెళ్తున్న అతన్ని చూసిన కొందరు సెల్ఫోన్లో షూట్ చేశారు. అంతేతప్ప సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కాలినడకన చిన్నారి మృతదేహంతో బస్టాండ్కు చేరుకున్నా బస్సులో ఎక్కేందుకు ఆయన దగ్గర చిల్లిగవ్వ లేదు. దీంతో తోటి ప్రయాణికుడు టికెట్ ఛార్జీ చెల్లించడంతో స్వగ్రామానికి చేరుకున్నారు. హృదయ విదారకరమైన ఈ ఘటన చూసిన వారందరూ చలించిపోయారు. ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది.
ఇటీవల సింగ్రౌలీ జిల్లాలో ఆస్పత్రి సిబ్బంది అంబులెన్స్ నిరాకరించడంతో ఓ జంట శిశువును బైక్కు సైడ్ బాక్స్ లో పెట్టి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా.. పాపను చూపించమని అడిగారు. వారు సైడ్బాక్స్ ను ఓపెన్ చేసి అందులో ఒక సంచిలో ఉంచిన చిన్నారి మృతదేహాన్ని బయటకు తీశారు. దీనిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
