అమరావతి, వెలుగు: తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో చనిపోయిన తెలంగాణ వాసుల కుటుంబీకులకు పరిహారం విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం సహాయ నిధి నుంచి ఒక్కో మృతుని కుటుంబానికి రూ.10 లక్షలు చొప్పున రూ.1.20 కోట్లు విడుదల చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. వరంగల్‌కు చెందిన 9 మందితో పాటు జనగామ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలకు చెందిన మరో ముగ్గురికి రూ.10 లక్షలు చొప్పున పరిహారం విడుదల చేసింది. ఈ మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వ ఖాతాలో జమ చేసి మృతుల కుటుంబీకులకు అందజేయాలని కోరనుంది.

