Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!

దేశంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో మొదటి స్థానం గుండె జబ్బులది కాగా ఆ తరవాత స్థానం క్యాన్సర్‌ది. అలాంటి ప్రాణాలు తీసే క్యాన్సర్ ను  ముందుగానే పసిగట్టొచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. క్యాన్సర్ కు కారణమయ్యే ప్రోటీన్లపై పరిశోధనలు చేస్తున్నారు. ప్రారంభ దశలో క్యాన్సర్ ను అడ్డుకునేందుకు ఈ ప్రోటీన్లు సహాయపడతాయని అంటున్నారు పరిశోధకులు. 

క్యాన్సర్ ప్రారంభ దశలలో పాల్గొనే ప్రోటీన్లను పరిశోధకులు గుర్తించారు. ఇవి వ్యాధి నిర్ధారణకు ఏడేళ్ల కంటే ముందే వ్యాధి అభివృద్ధిని గుర్తించేలా ఉపయోగపడుతున్నాయంటున్నారు.600 కంటే ఎక్కువ ప్రోటీన్లు.. ప్రేగు, ప్రోస్టేట్, రొమ్ముతో సహా 19 రకాల క్యాన్సర్లకు సంబంధం ఉందని.. ఈ ప్రోటీన్లను ఏడు సంవత్సరాల క్రితం రోగ నిర్ధారణ కోసం రక్తం సేకరించిన వ్యక్తుల్లో ఇవి కనుగొనబడ్డాయని అంటున్నారు. యూకె లో జరిగిన రెండు క్యాన్సర్ రీసెర్చ్ అధ్యయనాల్లో కనుగొన్న ఈ విషయాలు ..క్యాన్సర్ ను ప్రారంభానికి ముందే నిరోధించేందుకు  సహాయ పడుతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 

మొదటి అధ్యయనంలో UK బయోబ్యాంక్ నుండి 44,000 కంటే ఎక్కువ మంది వ్యక్తుల నుండి తీసుకున్న రక్త నమూనాలను విశ్లేషించారు  వీరిలో 4,900 మంది క్యాన్సర్ నిర్ధారణను కలిగి ఉన్నారని గుర్తించారు శాస్త్రవేత్తలు. తర్వాత క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తులు, లేని ఇతరుల ప్రోటీన్‌లను పోల్చారు. క్యాన్సర్ నిర్ధారణకు మూడు సంవత్సరాల ముందు రక్తంలో తేడా ఉన్న 182 ప్రోటీన్లను శాస్త్రవేత్తలు గుర్తించారు.

రెండవ అధ్యయనంలో పరిశోధకులు 300,000 కంటే ఎక్కువ క్యాన్సర్ కేసుల నుండి జన్యు డేటాను పరిశీలించారు. క్యాన్సర్ అభివృద్ధిలో ఏ ప్రోటీన్లు పాల్గొన్నాయో వాటికి చికిత్స అందించే లక్ష్యంగా విశ్లేషించారు.క్యాన్సర్ అభివృద్ధిలో ప్రోటీన్లు పోషిస్తున్న ఖచ్చితమైన పాత్రను తెలుసుకోవడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమని పరిశోధకులు అంటున్నారు. 

రక్తంలోని దాదాపు 40 ప్రోటీన్ల వల్ల తొమ్మిది రకాల క్యాన్సర్ల ప్రమాదం ఉందని అధ్యయనాల్లో తేలింది. మూత్రాశయం, రొమ్ము, ఎండోమెట్రియం, తల, మెడ, ఊపిరితిత్తులు, అండాశయం, ప్యాంక్రియాస్, మూత్రపిండాలు, ప్రాణాంతక నాన్-మెలనోమా వంటి క్యాన్సర్లకు ఇవి కారణమని చెపుతున్నారు.


ఈ అధ్యయనాలు చాలా ముఖ్యమైనవి.. అవి బహుళ క్యాన్సర్‌ల కారణాలు, జీవశాస్త్రం గురించి అనేక కొత్త ఆధారాలను అందిస్తాయని.. క్యాన్సర్ వచ్చే ఐదు సంవత్సరాల ముందు శరీరంలో ఏం జరుగుతుందో దానికి సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు ఈ అధ్యయనాలు సహాయపడతాయని అంటున్నారు. 

గ్యాలరీ టెస్ట్ అని పిలువబడే ఒక పరీక్ష బ్రిటన్ NHSలో ట్రయల్స్‌లో ఉంది..అయితే ఇది రక్తంలో ప్రసరించే కణితి DNAని గుర్తించడానికి పనిచేస్తుందన్నారు. పరిశోధకులు వారు కనుగొన్న ప్రోటీన్లు క్యాన్సర్ నివారణకు లక్ష్యంగా ఉండవచ్చని సూచిస్తున్నారు. క్యాన్సర్ నుంచి బయటపడాలంటే నివారణ, ముందస్తుగా గుర్తించడం అవసరం అంటున్నారు పరిశోధకులు.