- అంధుల కోసం పరికరం తయారుచేసిన రవికిరణ్
- ఈనెల 24 నుంచి 30 వరకు టర్కీలో సదస్సు
ఆసిఫాబాద్/కాగజ్ నగర్, వెలుగు : ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ నవోదయ పూర్వ విద్యార్థి రవికిరణ్ తయారుచేసిన ‘బ్లైండ్ ఐ పరికరం’ ప్రాజెక్టును అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించే అవకాశం వచ్చింది. టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా యూనిసెఫ్ గ్లోబల్ ఇన్నొవేషన్ సమ్మిట్‌లో ఈ ప్రాజెక్టును ఆవిష్కరించనున్నారు. ఈనెల 24 నుంచి 30 వరకు 2024గ్లోబల్ ఇంక్యేబేషన్ వీక్ ఫర్ ఇమాజిన్ వెంచర్స్ గ్లోబల్ విన్నర్స్ ఈ సదస్సు జరగనుంది. మన దేశం తరపున రవికిరణ్ ప్రాతినిధ్యం వహించనున్నాడు.
ఈ మేరకు యూనిసెఫ్ నుంచి ఆహ్వానం అందిందని అతను వెల్లడించాడు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దస్నాపూర్కి చెందిన ఆర్టీసీ ఉద్యోగి ప్రేమ్ సింగ్,- కళావతి దంపతుల కొడుకు తగిరే రవికిరణ్.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏకైక నవోదయ విద్యాలయంలో పదో తరగతి వరకు చదివాడు. ఐదేళ్ల కిందట కాగజ్ నగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో క్లాస్ లోని మరో స్టూడెంట్‌తో కలిసి ‘బ్లైండ్ ఐ’ పరికరం ప్రాజెక్టు చేపట్టాడు. ఏఐ టెక్నాలజీతో కళ్లజోడులాగా దీన్ని రవికిరణ్ రూపొందించాడు.
అంధులు ఈ కళ్లజోడు పెట్టుకుని ఇంకొకరి సాయం లేకుండా నడవడంతో పాటు వారి పనులన్నీ చేసుకోవచ్చు. ఈ పరికరం లో ఏర్పాటు చేసిన సెన్సార్, చిప్‌లు.. ఎదురుగా ఉన్న వస్తువుల గురించి అలర్ట్ లు ఇస్తాయి. ఇప్పటికే దీనిని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్ స్టిట్యూట్లో సైతం ప్రయోగాత్మకంగా పరిశీలించగా మంచి ఫలితాలు వచ్చాయని రవికిరణ్ తెలిపాడు. ఎల్వీ ప్రసాద్ ఇన్ స్టిట్యూట్ నుంచి రూ.2 లక్షల రూపాయల సహకారం కూడా అందిందని చెప్పాడు.
అలాగే కేంద్ర ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వశాఖ నుంచి రూ.35 లక్షల ప్రోత్సాహం అందిందని తెలిపాడు. ఈ పరికరం పేటెంట్ కోసం ఇప్పటికే ఏలియన్ ఇన్నొవేషన్ తరపున అప్లయ్ చేశామని వెల్లడించాడు. ఈ పరికరం ధర రూ.8 వేల నుంచి 12 వేల వరకు ఉంటుందని పేర్కొన్నారు.