వామ్మో.. బిర్యానీలో బ్లేడ్.. హైదరాబాద్లో ఓ బార్‌ అండ్‌‌‌‌ రెస్టారెంట్‌‌లో ఘటన

  • బిల్లులో డిస్కౌంట్ కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నారని యాజమాన్యం ఆరోపణ

ఘట్​కేసర్, వెలుగు: బిర్యానీలో బ్లేడ్‌‌‌‌ వచ్చిన ఘటన హైదరాబాద్‌‌‌‌ ఘట్కేసర్‌‌‌‌‌‌‌‌లోని ఓ బార్ అండ్‌‌‌‌ రెస్టారెంట్‌‌‌‌లో జరిగింది. యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం మక్త అనంతారంకు చెందిన బింగి అయిలయ్య యాదవ్ తన ముగ్గురు ఫ్రెండ్స్‌‌‌‌తో కలిసి ఆదివారం ఘట్కేసర్ బైపాస్‌‌‌‌లోని ఆదర్శ్ బార్ అండ్ రెస్టారెంట్‌‌‌‌కు వెళ్లారు. అక్కడి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేయగా, సప్లైయర్ బిర్యానీ తీసుకొచ్చాడు. బిర్యానీ తింటుండగా అందులో బ్లేడ్ వచ్చింది.

బార్ యాజమాన్యాన్ని పిలిచి బిర్యానీలో బ్లేడ్ వచ్చిన విషయంపై వారిని నిలదీశారు. అయితే, రెస్టారెంట్‌‌‌‌ నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో వారికి బార్ యాజమాన్యంతో వాగ్వవాదం జరగడంతో అయిలయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

బిర్యానీలో ఇనుప ముక్కలు
పరిగి, వెలుగు: బిర్యానీలో ఇనుప ముక్కలు వచ్చాయని హోటల్‌‌‌‌ యజమానికి ఫిర్యాదు చేసిన కస్టమర్లపై సిబ్బంది దాడి చేశారు. ఈ ఘటన వికారాబాద్‌‌‌‌ జిల్లా పూడూరు మండలం అంగడి చిట్టెంపల్లిలోని నక్షత్ర హోటల్‌‌‌‌లో ఆదివారం జరిగింది. చేవెళ్ల మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన మహేందర్, నాగరాజు, గిరిధర్, ప్రశాంత్, శంకర్ సురేందర్ బిర్యానీ తినేందుకు నక్షత్ర హోటల్‌‌‌‌కు వెళ్లారు. చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకొని తింటుండగా, అందులో ఇనుప ముక్కలు వచ్చాయి. ఈ విషయంపై హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా, వారికి సారీ చెప్పారు. అనంతరం బాధితులకు చికెన్‌‌‌‌కు బదులు మటన్ బిర్యానీ ఇచ్చారు.

అయితే, బిల్లు కట్టే సమయంలో మటన్ బిర్యానీలో పీసులు లేవని చెప్పారు. ఈ క్రమంలో హోటల్ యజమాని, సిబ్బందితో బాధితులకు మాటమాట పెరిగింది. దీంతో సుమారు 25 మందికి పైగా హోటల్ సిబ్బంది వారిపై దాడి చేశారు. పారిపోతున్న బాధితులను వెంబడించి హోటల్‌‌‌‌కు తీసుకొచ్చి కొట్టారు. హోటల్ యజమాని భార్య కిచెన్ రూమ్‌‌‌‌లోకి తీసుకెళ్లి తమను చెప్పుతో కొట్టిందని బాధితులు తెలిపారు. ఈ క్రమంలో స్థానికులు హోటల్‌‌‌‌కు చేరుకొని, దాడిని అడ్డుకున్నారు. అనంతరం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.