కోట్లలో పేరుకుపోతున్న నల్లా బిల్లులు..వనపర్తి మున్సిపాలిటీలోనే రూ.6 కోట్లు

  • జిల్లాలోని అయిదు మున్సిపాలిటీల్లో వసూళ్లు అంతంతే

వనపర్తి, వెలుగు : వనపర్తి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో నల్లా బిల్లులు కొండలా ఏండ్ల తరబడి పేరుకుపోతున్నాయి. వనపర్తి జిల్లా ఏర్పాటు తరువాత కొత్తగా నాలుగు మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. ఐదు మున్సిపాలిటీల్లో కలిపి అధికారిక లెక్కల ప్రకారం 27,500 నల్లాలు ఉన్నాయి. ఇందులో ఆన్​లైన్​లో నమోదైనవి 50 శాతం కూడా లేవు. వీటిలో 13,928 నల్లాలు మాత్రమే ఆన్​లైన్​లో నమోదయ్యాయి. 

నత్తనడకన వసూళ్లు..

మున్సిపాలిటీల్లో నల్లా బిల్లుల వసూళ్లు నత్తనడక నడుస్తోంది. గతంలో ఇంటింటికీ తిరిగి మున్సిపల్​ ఉద్యోగులు నల్లా బిల్లులను వసూలు చేసేవారు. ప్రభుత్వం ఆన్​లైన్​ చేయడంతో.. బిల్లుల చెల్లింపులు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఇలా రూ.కోట్లలో బిల్లులు పేరుకుపోతున్నాయి. జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో కలిపి రూ.6,81,61,000 ఉండగా, ఇప్పటి వరకు రూ.63,40,000 వసూలయ్యాయి. 

జిల్లా కేంద్రంలో 6 శాతమే..

వనపర్తి మున్సిపాలిటీలో నల్లా బిల్లుల వసూలు తక్కువగా ఉంది. ఇక్కడ రూ.6 కోట్ల బకాయిలు ఉంటే రూ.40 లక్షలే వసూలయ్యాయి. అంటే 6 శాతమే వసూలయ్యాయన్నమాట. కలెక్టర్, అడిషనల్​ కలెక్టర్లు మున్సిపాలిటీ నల్లా బిల్లులు, ఆస్తి పన్ను వసూళ్లపై దృష్టి పెట్టాలని పదే పదే ఆదేశిస్తున్నా ఎలాంటి ఫలితం ఉండడం లేదు. జిల్లాలోని పెబ్బేరు, ఆత్మకూరు, అమరచింత, కొత్తకోట మున్సిపాలిటీల్లో ఆన్​లైన్​లో  నల్లా వివరాలు పూర్తి స్థాయిలో నమోదు కాకపోవడంతో వసూళ్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. కొత్తకోటలో అసలు ఆన్​లైన్​లోనే నమోదు కాకపోవడం గమనార్హం. 

నల్లా బిల్లుల బకాయిలు ఇలా..

       మున్సిపాలిటీ       నల్లాలు       బకాయిలు         

  • వనపర్తి                  16,365         రూ.6 కోట్లు  
  • ఆత్మకూరు           3,100           రూ.10 లక్షలు   
  • కొత్తకోట                 3,040           రూ. 32 లక్షలు
  • పెబ్బేరు                2,300           రూ.30 లక్షలు  
  • అమరచింత         1,800           రూ.9.61 లక్షలు