ఢిల్లీలో ఆపరేషన్ లోటస్.. ఓటర్ లిస్ట్ మార్చేందుకు బీజేపీ కుట్రలు: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఆపరేషన్ లోటస్ పేరుతో ఓటర్ల జాబితాను ఆ పార్టీ తారుమారు చేస్తోందని ఆరోపించారు. ఒక్క న్యూఢిల్లీలోనే 5 వేల మంది ఓటర్లను తొలగించి, కొత్తగా 7,500 మందిని చేర్చిందని చెప్పారు.

వచ్చే ఏడాదిలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు డిసెంబర్ 15 నుంచే బీజేపీ ఈ ఆపరేషన్‎కు పాల్పడుతోందని ఆయన ఆదివారం ఆరోపించారు. ‘‘బీజేపీ తన ఓటమిని ఇప్పటికే అంగీకరించింది. వాళ్లు చెప్పుకోనీకి చేసిందేమీ లేదు. సీఎం క్యాండిడేట్ లేరు. అభ్యర్థులు లేరు. జనాల్లోకి వెళ్లి ఓట్లడిగే పరిస్థితి లేదు. 

ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఓటర్ లిస్ట్‎ను తారుమారు చేయడం వంటి కుట్రలు పన్నుతున్నరు. న్యూఢిల్లీ అసెంబ్లీ సెగ్మెంట్‏లోనే 15 రోజుల్లో 5 వేల మంది ఓటర్లను తొలగించారు. నకిలీ పేర్లను ఓటర్ లిస్ట్‎లోకి ఎక్కించేందుకు పనిచేస్తున్నరు”అని కేజ్రీవాల్ అన్నారు. 

షహదారా సెగ్మెంట్‎లో 12 వేల మంది ఓటర్ల పేర్లను తొలగించేందుకు ప్రయత్నించారని.. అయితే, కేంద్ర ఎలక్షన్ కమిషన్ జోక్యంతో ఆపేశారని గుర్తుచేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పినదాని ప్రకారం న్యూఢిల్లీ సెగ్మెంట్‎లో కొత్తగా లక్ష మంది ఓటర్లు చేరారని, అందులో 12% అవకతవకలు జరిగాయని కేజ్రీవాల్ తెలిపారు. ఏకంగా ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ భార్య ఓటును తొలగించేందుకు బీజేపీ ప్రయత్నించిందన్నారు.