రైతుల హామీలపై జనవరి 10న బీజేపీ నిరసనలు : కాసం వెంకటేశ్వర్లు 

  • స్టేట్ జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లు 

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈ నెల 10న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నామని బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఇప్పటికీ రైతు భరోసా ఇవ్వకపోవడం సిగ్గు చేటని చెప్పారు. శుక్రవారం కలెక్టర్లు, తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇస్తామని పేర్కొన్నారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణన రిపోర్టును బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ ఏమైందని ప్రశ్నించారు. సారా అమ్మి జైలుకెళ్లిన వారికి బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని కవితను పరోక్షంగా విమర్శించారు. పాలించడానికి బీసీలు పనికిరారని గతంలో రేవంత్ రెడ్డి స్టేట్ మెంట్ ఇచ్చి వారిని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ మంగళవారం కలెక్టర్లు, తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇవ్వనున్నట్టు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ పేర్కొన్నారు.