రాజకీయాల్లో విలువలు పాటించిన నేత వాజ్​పేయి : కిషన్ రెడ్డి

  • ఊరూరా రోడ్డు వేసిన ఘనత ఆయనదే

హైదరాబాద్, వెలుగు: దేశ రాజకీయాల్లో నైతిక విలువలకు ప్రాధాన్యమిచ్చిన ఏకైక నాయకుడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్​పేయి అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. పార్లమెంట్​లో ఒక్క ఓటు తేడాతో ప్రధాన మంత్రి పదవిని వదులుకుని.. నైతిక విలువలకు ప్రాధాన్యమిచ్చారని తెలిపారు. దేశంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌‌లోని ఓ హోటల్​లో అటల్ బిహారీ వాజ్​పేయి (ఏబీవీ) ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాజ్​పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా సంస్మరణ సభ నిర్వహించారు. 

ఈ సభకు కిషన్ రెడ్డి హాజరై మాట్లాడారు. వాజ్ పేయి జయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. ఆయన జీవితంలోంచి నేటి యువత, రేపటి తరం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలను రోడ్లతో అనుసంధానం చేసినప్పుడే అభివృద్ధి సాధ్యమని.. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పేరుతో ఊరూరా రోడ్లు వేసిన ఘనత వాజ్ పేయి దేనని చెప్పారు.