కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలో తేడా లేదు : కిషన్ రెడ్డి

  • ప్రజలను వంచించడం, రాష్ట్రాన్ని దోచుకోవడమే వాళ్ల పని
  • రేవంత్, కేసీఆర్ నాణేనికి బొమ్మాబొరుసులాంటోళ్లు 
  • ఒకరి మీద ఒకరిది దొంగ ఏడ్పులు అని విమర్శ

న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలో ఏం తేడా లేదని, సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్.. నాణేనికి బొమ్మ బొరుసు లాంటి వ్యక్తులు అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పదేండ్లు రాష్ట్రాన్ని ఎలా అయితే భ్రష్టు పట్టించిందో.. ఏడాది పాలనలో కాంగ్రెస్ అదే చేసిందన్నారు. ప్రజలను వంచించారని, రాష్ట్ర సంపదను దోచుకున్నారని ఆరోపించారు.

 ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో బుధవారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘దొంగలు.. దొంగలు.. ఊళ్లు పంచుకున్నట్లు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వ్యవహరిస్తున్నయ్. ఒకరిమీద ఒకరు దొంగ ఏడ్పులు ఏడుస్తున్నయ్. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాల్జేసిండు. రేవంత్ రెడ్డి మరింత దిగజారుస్తున్నడు’’అని కిషన్ రెడ్డి విమర్శించారు.

ఏడాదిలోనే రూ.80వేల కోట్ల అప్పు చేసిన్రు

బీఆర్ఎస్ పదేండ్లలో రూ.7.5లక్షల కోట్ల అప్పులు చేస్తే.. కాంగ్రెస్ సర్కార్ ఏడాదిలోనే రూ.80 వేల కోట్ల అప్పులు చేసిందని కిషన్ రెడ్డి అన్నారు. రెండు పార్టీలూ.. రైతులకు సంకెళ్లు వేశాయన్నారు. సెన్సేషన్ క్రియేట్ చేసేందుకే సినీ నటుడు అల్లు అర్జున్​ను అరెస్ట్ చేయించారని తెలిపారు. హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో ఇండ్లు కూల్చడం తప్ప.. ఇంకేం చేయలేదన్నారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి కేసుల విచారణ ఎక్కడిదాకా వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.