తృణమూల్‌‌లో చేరిన బీజేపీ ఎంపీ భార్య.. విడాకులు ఇస్తానన్న భర్త

తృణమూల్‌‌లో చేరిన బీజేపీ ఎంపీ భార్య.. విడాకులు ఇస్తానన్న భర్త
కోల్‌‌కతా: వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్‌‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన కసరత్తులను పార్టీలు ఇప్పటికే ప్రారంభించాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ని మట్టికరిపించాలని చూస్తున్న బీజేపీ ఆ పార్టీ నేతలను చేర్చుకుంటోంది. అయితే బీజేపీ నేతలపై కూడా టీఎంసీ దృష్టి పెట్టింది. ఈ క్రమంలో తాజాగా బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్ భార్య సుజాతా మోండల్ ఖాన్‌‌ను టీఎంసీ చేర్చుకుంది. బీజేపీ యువ మోర్చా ప్రెసిడెంట్ అయిన సౌమిత్ర ఖాన్.. బిష్ణుపూర్‌‌ నియోజవర్గ ఎంపీ కావడం గమనార్హం. తృణమూల్‌‌లో తన భార్య సుజాత చేరడంపై సౌమిత్ర ఖాన్ సీరియస్ అయ్యారు. తన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశారంటూ టీఎంసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటిని నాశనం చేసిన వారిని వదిలి పెట్టబోనని స్పష్టం చేశారు. సుజాతా మోండల్‌‌కు విడాకుల లేఖను పంపనున్నట్లు తెలిపారు. ‘నేను ఆమెకు డివోర్స్ నోటిస్ పంపబోతున్నా. టీఎంసీతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నా. నా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసినందుకు తృణమూల్ సిగ్గుపడాలి’ అని సౌమిత్ర పేర్కొన్నారు.