లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్​పై..కాంగ్రెస్ స్టాండ్​ ఏంటో చెప్పాలి: డీకే అరుణ

షాద్ నగర్, వెలుగు : లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణంపై కాంగ్రెస్ స్టాండ్ ఏమిటో చెప్పాలని మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్థన్ రెడ్డి, అందే బాబయ్య, పాలమూరు విష్ణువర్థన్ రెడ్డితో కలిసి బుధవారం షాద్ నగర్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. దేశంలోని ఏ ఒక్క రాష్ట్రంలోనూ కాంగ్రెస్​హవా లేదన్నారు. కాంగ్రెస్​నేతల అసమర్థ పాలనతోనే తెలంగాణలో కరువు దాపురించిందని విమర్శించారు. ప్రాజెక్టులు అడుగంటడంతో పంటలు ఎండిపోయాయని, తాగునీటి కోసం జనం అల్లాడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్​నేతలు మాత్రం మాది ప్రజా పాలన అని గొప్పలు చెప్పుకుంటున్నారని, రాష్ట్రంలోని సాగు, తాగునీటి కష్టాలు, కరెంటు కోతలు కనబడడం లేదా అని ప్రశ్నించారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై బీజేపీని దెబ్బతీయాలని చూశాయని, ఇప్పుడు ఆ పార్టీలే ప్రమాదంలో పడ్డాయని చెప్పారు. ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్కటైనా అమలు చేశారా అని నిలదీశారు. కాళేశ్వరంపై ఎందుకు సరైన విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రాగానే సీబీఐ ఎంక్వైరీ వేయిస్తామని అరుణ చెప్పారు. ఫోన్ ట్యాపింగ్​పేరుతో హడావిడి చేస్తున్నారని, తెలంగాణలో కాంగ్రెస్ 17 సీట్లు గెలిచేది లేదు.. రాహుల్ ప్రధాని అయ్యేది లేదని అని ఎద్దేవా చేశారు. పాలమూరులో బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు.