మహిళా మంత్రిపై ఇంత పచ్చి బూతులా.. కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్సీ అరెస్టు

శాసన మండలి అంటే రాష్ట్రంలో పెద్దల సభ.. అత్యంత గౌరవప్రదమైన వ్యక్తులు, వివిధ రంగాలలో సేవలు చేసిన  మేధావులు ఉండే చోటు. అలాంటి పెద్దల సభలోనే ఒక మహిళకు అవమానం జరగటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అది కూడా ఒక మహిళా మంత్రికి అవమానం జరగటం కర్ణాటక రాజకీయాల్లో ఇప్పుడు సంచనలంగా మారింది. కర్ణాటకలో ఈ అంశంపై ఒకవైపు కాంగ్రెస్, మరోవైప బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు దిగే వరకు వెళ్లింది.
కర్ణాటక మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ కు శాసన మండలిలో ఘోర అవమానం జరిగింది. బీజేపీ ఎమ్మెల్సీ సిటి రవి ఆమెను అనకూడని మాట పదే పదే అనడం వివాదానికి దారితీసింది. చెప్పడానికి కూడా ఇబ్బందికరమైన బూతు పదంతో మంత్రిని బీజేపీ ఎమ్మెల్సీ తిట్టినట్లు ఆమె మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. 
పార్లమెంటులో అంబేద్కర్ గురించి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గురువారం కర్ణాటక శాసన మండలిలో ఆందోళన నిర్వహించారు. సభ్యుల ఆందోళనతో సభను చైర్మన్ పది నిమిషాలు వాయిదా వేశారు. అదే సమయంలో రాహుల్ గాంధీని బూతులు తిడుతున్నట్లు గమనించిన మంత్రి హెబ్బాల్కర్.. అలాంటి మాటలు మాట్లాడటం తగదని వారించారట. దాంతో ఘోరమైన బూతు పదాన్ని వాడి అవమాన పరిచినట్లు మంత్రి హెబ్బాల్కర్ తెలిపారు. అతని బూతులకు ఏం మాట్లాడాలో.. ఎలా స్పందించాలో కూడా తనకు అర్థం కాలేదని మంత్రి వాపోయారు. మహిళ, అందులో మంత్రి అని చూడకుండా ఘోరంగా అవమానించాడని ఆమె మిగతా సభ్యుల సమక్షంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. 

Also Read :- ఆ నది నీటిని ముట్టుకున్నారా.. అంతే సంగతులు

చైర్మన్ కు ఫిర్యాదు చేయగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారట. అయితే దీనిపై రవిని ప్రశ్నించగా తనపై కుట్ర పూరితంగా ఫిర్యాదు చేశారని అన్నారు. తనను కేసులో ఇరికించాలని, అరెస్టు చేయాలని కుట్ర పన్నారని రవి ఆరోపించారు. తను బూతు మాటలు మాట్లాడలేదని కావాలంటే చెక్ చేసుకొమ్మని కోరారు. 
అయితే సభ రికార్డులను చెక్ చేయగా.. సభ వాయిదా పడిన సమయంలో రికార్డింగు కూడా ఆపేసి ఉండటంతో రవి ఏం మాట్లాడారో తెలియలేదు. అయితే రవి దాదాపు పది సార్లు ఆ మాట వాడారని, తాము విన్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. 
ఈ వివాదంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ.. బీజేపీ ఎమ్మెల్సీ రవి తప్పుడు వ్యాఖ్యలు చేసినట్లు తన వద్దకు వచ్చిందని, విచారణ జరిపిస్తామని తెలిపారు. 
సి.టి.రవిపై బీఎన్ఎస్ సెక్షన్లు 75 (లైంగిక వేధింపులు), 79 (మాటలతో మహిళ గౌరవానికి భంగం కలిగించడం) కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.