2024 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఆసక్తికర పరిణామాల నడుమ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా విపక్షాల మధ్య పొత్తు కుదురుతుందా లేదా అన్న అంశం సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపించేలా ఉంది. బీజేపీ, జనసేనల మధ్య ఇప్పటికే పొత్తు కొనసాగుతుండగా, చంద్రబాబు అరెస్ట్ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని ప్రకటించాడు. 2019 ఎన్నికలకు ముందు బీజేపీతో తెగదెంపులు చేసుకొని ఎన్డీయే కూటమి నుండి బయటికి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు బీజేపీతో పొత్తు కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. అయితే, టీడీపీతో పొత్తుపై బీజేపీ అధిష్టానం నుండి ఇంకా ఎలాంటి క్లారిటీరాలేదు.
మరో పక్క టీడీపీ, జనసేన మధ్య సీట్ల పంపకం విషయం కూడా ఇంకా కొలిక్కి రాలేదు. మొన్న చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీ అయ్యాక పొత్తు విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఆ తర్వాత 22న పవన్ ఢిల్లీ బీజేపీ పెద్దలతో పొత్తు అంశంపై చర్చించాక టీడీపీతో పొత్తు, సీట్ల పంపకం విషయాల్లో క్లారిటీ వస్తుందని ఉహాగానాలు వచ్చాయి కానీ, పవన్ ఢిల్లీ పర్యటన మీద ఎలాంటి క్లారిటీ రాలేదు.
ఇదిలా ఉండగా, ఈ నెల 28న తాడేపల్లి గూడెంలో టీడీపీ, జనసేనలు బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించాయి. మరో పక్క 27న ఏలూరులో బీజేపీ బహిరంగసభ ఉంటుందని, ఈ సభకి కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ హాజరవుతారని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రకటించింది. పొత్తులకు, ఈ బహిరంగ సభకి ఎలాంటి సంబంధం లేదని, ఆ అంశాలు అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపింది. దీన్ని బట్టి చూస్తే టీడీపీతో పొత్తుకు రాష్ట్ర క్యాడర్ సుముఖంగా ఉన్నప్పటికీ అధిష్టానం మాత్రం సుముఖంగా లేదనే అనుకోవాలి. ఈ బహిరంగ సభల తర్వాత అయినా విపక్షాల మధ్య పొత్తు గురించి అధికారిక ప్రకటన వస్తుందా లేదా వేచి చూడాలి.