మల్లన్న ఆలయంలో అవినీతికి నిరసనగా ధర్నా

కొమురవెల్లి, వెలుగు: మల్లన్న ఆలయంలో జరిగిన అవినీతిపై పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదని మంగళవారం బీజేపీ నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ.. మల్లన్న ఆలయంలో 55 గదుల నిర్మాణ పనులు మూడేళ్లుగా కొనసాగుతున్నాయని, క్యూ కాంప్లెక్స్ నిర్మాణంలో నాణ్యతా లోపాలున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు.

దాసారపు గుట్టకు, ఘాట్ రోడ్డుకు రూ.ఆరు కోట్లను కేటాయించి ఆలయ నిధులను వృథా చేశారని మండిపడ్డారు. ఔట్​సోర్సింగ్​ఉద్యోగుల నియామకంలో లక్షల రూపాయలు వసూలు చేశారని, ఒగ్గు పూజారుల సమస్యల పరిష్కారంలో అధికారులు డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు. కోర్టు కేసులో ఉన్న ఆలయ భూములకు  దేవాలయం తరపున ఈవో హాజరుకావడం లేదన్నారు. 

ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలు తొలగించాలని, లేని పక్షంలో రిలే నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ జనగామ అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి, నాయకులు మల్లేశం, మహేందర్ రెడ్డి, బాల నర్సయ్య, రాములు, భిక్షపతిరెడ్డి, కనకయ్య, కరుణాకర్, తిరుపతి పాల్గొన్నారు.