ధరణి పేర పేదల భూములు లాక్కున్న కేసీఆర్​ : లక్ష్మణ్

కొల్లాపూర్, వెలుగు: ధరణి పేరుతో పేదలకిచ్చిన అసైన్డ్ భూములను కేసీఆర్​ ప్రభుత్వం లాక్కుని అప్పనంగా బడా వ్యాపార వేత్తలకు కట్టబెట్టిందని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత డాక్టర్​ కె. లక్ష్మణ్​ ఆరోపించారు. కొల్లాపూర్ లోని బీజేపీ ఆఫీసులో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల్లో జరగిన అవినీతి పై సీబీఐ విచారణ చేయిస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. 

తెలంగాణ లో17పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. దేశం అభివృద్ధి కావాలంటే మోదీ ప్రధాని కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. దేశంలో రైతులకు సబ్సిడీపై ఎరువులు ఇచ్చామని, తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి నిధులు ఇచ్చామని చెప్పారు. దేశంలో ఎక్కడ అవినీతి కి తావులేకుండా బీజేపీ పాలన సాగుతుందన్నారు. బీఆర్ఎస్​ పూర్తిగా మునిగిపోయిన నావ అని, కాంగ్రెస్​ మునగడానికి సిద్ధంగా ఉన్నదని ఎద్దేవా చేశారు.

 కొల్లాపూర్ ప్రాంతానికి నేషనల్ హైవే మంజూరైందని, కృష్ణ నదిలో తీగల వంతెన పనులు జరుగుతున్నాయన్నారు. అనంతరం బీజేపీ విజయ సంకల్ప యాత్రను ప్రారంభించారు. సింగోటం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట్రామారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు,బీజేపీ నాయకులు ఆచారి, బంగారు శృతి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.