గెలుపు కోసం ఓట్ల నినాదాలు

ఎన్నికల్లో  గెలుపు కోసం నాయకులు జనంను విడగొట్టి ఓట్లు దండుకునే నినాదాలు ఇస్తున్నారు. బటోగే తో  కటోగే అంటూ బీజేపీ నినాదంకు ఇండియా కూటమి ఇప్పుడు జుడోగే తో  జీతోగే అనే కౌంటర్ ప్రచారం మొదలు పెట్టింది.  యూపీ మాజీ  సీఎం అఖిలేష్  యాదవ్  ఇచ్చిన ఈ నినాదం బీజేపీలో ఒక వర్గం ప్రజలను రెచ్చగొట్టడానికి ఉపయోగంలోకి తెచ్చిన ‘విడిపోతే తెగుతారు’ అనే ఘోర నినాదానికి ఒక సూపర్ కౌంటర్.

మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి.  కాంగ్రెస్ నేత,  పార్లమెంట్​లో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి కూడా ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. మహారాష్ట్రలో  బీజేపీ దాని మిత్రపక్షాల మధ్యన సీట్ల షేరింగ్​లో  కొంత  గందరగోళం ఉంది.  ఇటు ఇండియా కూటమిలోనూ అలాంటి పరిస్థితే ఉన్నది. రెబల్స్ రంగంలోకి రావడం వల్ల కాంగ్రెస్​కు హర్యాణాలో  నష్టం జరిగింది.  మహారాష్ట్రలో అలాంటిది జరగకుండా జాగ్రత్తపడాలి.

వేడెక్కిన రాజకీయ వాతావరణం

కాంగ్రెస్,  ఎన్సీపీ,  శివసేన పార్టీల నుంచి విడిపోయి బీజేపీ పంచన చేరిన,  చేరుతున్నవారితో  ఇప్పుడు  ముంబై,  దాని చుట్టుపక్కల రాజకీయ వాతావరణం వేడెక్కుతున్నది.  -దీంతో--- తమ కూటమిలో,  తమ పార్టీలో  కొందరు నేతలను చేర్చుకుని  బీజేపీ  ఆయా నేతల  అవినీతి  ముద్రలను కడిగేస్తున్నది. మహారాష్ట్ర  సీఎంగా ప్రస్తుతం ఉన్న ఏక్ నాథ్​ షిండే శివసేనను చీల్చి బీజేపీ  మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈయనతో పాటు  బయటకువచ్చిన అందరిమీద అంతవరకు ఉన్న స్కాంలు, ఈడీ కేసులు చల్లటి సంచిలోకి పోయాయి.

అలాగే ఎన్సీపీని చీల్చి ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న అజిత్ పవార్ మీద గల 80,000 కోట్ల స్కాం, ఈడీ కేసును మూటగట్టి మూలన పడేశారు. మంత్రిగా ఉద్ధవ్​ థాకరే మంత్రి వర్గంలో ఉండి సైనికుల హోసింగ్​లో  వేల కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లి వచ్చిన నవాబ్ మల్లిక్ ఇప్పుడు అజిత్ పవార్ పార్టీలో చేరి టికెట్ పొందాడు.  ఆయన కూతురు సనా మల్లిక్​కు  కూడా టికెట్ ఇచ్చారు.  ఒకప్పుడు  దావుద్ ఇబ్రహీంలాంటి అండర్ వరల్డ్ తో  నవాబ్ మల్లిక్ కు  సంబంధాలు ఉన్నాయని చెప్పిన  ఫడ్నవీస్ ఇప్పుడేమీ  మాట్లాడడం లేదు. 

అవినీతి నేతలే ఎక్కువ

ప్రఫుల్ పటేల్ బీజేపీలో చేరకముందు ఆయనకు అండర్ వరల్డ్ మాఫియా ఇక్బాల్​తో  లింక్స్ ఉన్నాయన్నారు.  అశోక్ చౌహాన్ అమర సైనికుల డబ్బులు తిన్నాడని పేర్కొన్న ఫడ్నవీస్ అతను బీజేపీ వాషింగ్ మిషన్​లో  పడగానే సైలెంట్ అయిపోయాడు, నారాయణ్ రాణే  కూడా అంతే.  ఎన్నో భయంకర అవినీతి, అక్రమాల ఆరోపణలను ఎదుర్కొన్న మహారాష్ట్రకు చెందిన పలు పార్టీల నేతలు, మొత్తంగా బీజేపీ పంచన చేరినవారే  ఇప్పుడు ఎక్కువగా  పోటీలో  కనిపిస్తున్నారు.

ఇండియా కూటమి ఐక్యంగా  ఇక్కడ ఎన్నికలను ఎదుర్కోవాలి. అనవసరంగా  రెబల్స్,  ఫ్రెండ్లీ ఫైట్ పేరిట ఓట్లు చీలకుండా పొత్తుల నీతిని, ఓట్ల షేరింగ్ సహా  జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి.  నామినేషన్ల పర్వం ముగిసింది.  కాబట్టి, అన్నీ ఒక కొలిక్కి తీసుకునివచ్చి  ప్రచార రంగంలోకి ఐక్యంగా వెళ్ళిపోవాలి. సీఎం పదవి దృష్టితో ఎన్నికల ప్రచారం ఉండకూడదు.  ఎవరో ఒకరు సీఎం అవుతారు,  అందుకోసం ఇండియా కూటమి విధానాలను, లక్ష్యంను  తాకట్టు పెట్టొద్దు.

వర్గ విభేదాలు సృష్టిస్తున్న బీజేపీ

నిరుద్యోగం, పేదరికం, అసమానతలకు పరిష్కారం కనిపిస్తలేదు.  హిందూ, ముస్లింల పేరిట విభజన, అందుకోసం జాగో యాత్రలు తప్ప ఏమీలేవు. దేశం ఐక్యతతో   ప్రజల సమస్యల పరిష్కారం చూపే రాజకీయాలవైపు మొగ్గుచూపే పరిస్థితి రావాలి.  బీజేపీ నేతల ద్వంద్వ రాజకీయ గేమ్​ అర్థం చేసుకోవాలి.  మహారాష్ట్రలోనే కాదు.  దేశంలో ఎక్కడ చూసినా ఈడీ, ఐటీ, సీబీఐ కేసులలో ఉన్న
వాళ్లు  బీజేపీలో చేరితే  లేదా బీజేపీ కూటమితో కలిసి వస్తే మొత్తం కేసులన్నీ మాఫ్.

ఈ ద్వంద్వ నీతిని, ఓన్లీ పవర్ పాలిటిక్స్ ఆంతర్యంను బుద్ధిజీవులు అర్థం చేసుకోవాలి. ఈరోజు కాకుంటే మరెప్పటికి సాధ్యంకాదు.  తాము ఏంచేసినా పవర్ కోసమే, అందుకోసం  ఏమైనా చేయగలం అనే మాటను ఇటీవల బెంగాల్​లో జరిగిన సభలో  దాదా సాహెబ్ పాల్కె అవార్డు గ్రహిత,  బీజేపీ నేత మిథున్ చక్రవర్తి  హోంమంత్రి అమిత్ షా సమక్షంలో  పేర్కొన్న విషయాన్ని దేశం చూసింది. ఆయన ఒక సామాజికవర్గంను అవమానిస్తూ ఏం మాట్లాడిండో చూశాం. ఇంకా బుద్ధిజీవులు మౌనం వహించడం అంటే ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది. 

- ఎండి మునీర్,
సీనియర్ జర్నలిస్ట్