లిక్కర్ స్కాం కేసులో దోషి.. బీజేపీకి ఎలక్టోరల్ బాండ్ల విరాళం

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరో సంచలన విషయం బయటపడ్డింది. ఈ కేసుకి ఎలక్టోరల్ బాండ్స్ కు సంబంధం ఉన్నట్లు తేలింది. లిక్కర్ స్కామ్ కేసులో అప్రూవర్ గా మారిన ఓ వ్యక్తి రూ.52 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్‌ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇందులో ఎక్కువ వాటా బీజేపీకే అందినట్టు ఎన్నికల సంఘం విడుదల చేసిన డేటాలో ఉంది. అరబిందో ఫార్మా కంపెనీకి చెందిన శరత్ చంద్రారెడ్డి ఈ బాండ్స్‌ని కొనుగోలు చేశాడు. గతేడాది నవంబర్‌లో లిక్కర్ పాలసీ కేసులో శరత్ అరెస్ట్ అయ్యారు. ఆ తరవాత ఆయన అప్రూవర్‌గా మారారు. 2021 ఏప్రిల్ నుంచి 2023 నవంబర్ మధ్య కాలంలో కొనుగోలు చేసిన ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను పరిశీలించగా.. రూ.52 కోట్ల విలువైన బాండ్స్‌ని అరబిందో ఫార్మా కొనుగోలు చేసి వాటిలో ఎక్కువ శాతం బీజేపీకి డొనేట్ చేసినట్టు ఈసీ తెలిపింది. ఇందులో 60శాతం బీజేపీకి, మిగతా విరాళాలు BRS,TDPకి అందినట్టు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 

శరత్ చంద్రారెడ్డి 2022 నవంబర్ 10న అరెస్ట్ కాగా..  నవంబర్ 15న రూ.5 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్‌ అరబిందో ఫార్మా కొనుగోలు చేసినట్టు ఈసీ డేటా వెల్లడించింది.  నవంబర్ 21న బీజేపీ వాటిని ఎన్‌క్యాష్ చేసుకుంది. 2023 జూన్‌లో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారేందుకు ఢిల్లీ కోర్టు అనుమతినిచ్చింది. ఇప్పటికే లిక్కర్ పాలసీ స్కామ్‌లో ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీజేపీకే నిధులు అందాయని ఆప్ మంత్రి అతిషి ఆరోపించారు. ఈ ఆరోపణలకు తగ్గట్టుగానే ఈసీ విడుదల చేసిన లెక్కల్లో అదే విషయం వెల్లడైంది. 2021 నవంబర్‌కి ముందు శరత్ చంద్రారెడ్డికి ఢిల్లీలో 5 జోన్స్‌లో లిక్కర్‌ వెంట్స్‌ని ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి వచ్చిందని అతిషి వివరించారు. లిక్కర్ పాలసీ 2021 నవంబర్‌లో అమల్లోకి వచ్చింది. ఈ పాలసీ అమల్లో ఉన్నప్పుడే బీజేపీకి అరబిందో కంపెనీ నుంచి రూ.3 కోట్ల విరాళం వచ్చినట్టు అతిషి ఆరోపించారు.