ప్రియాంక ఎన్నికపై బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ కేసు

న్యూఢిల్లీ: వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్  ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికపై ఆమె ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ కేరళ హైకోర్టులో కేసు వేశారు. గత నెల జరిగిన వయనాడ్ ఉప ఎన్నికల సమయంలో నామినేషన్  పేపర్లలో ప్రియాంక తన ఆస్తులతో పాటు తన కుటుంబ సభ్యుల ఆస్తులపైనా తప్పుడు సమాచారం అందించారని ఆరోపిస్తూ నవ్య పిటిషన్ వేశారు. ఆదివారం ఓ వార్తా సంస్థతో ఆమె మాట్లాడారు. ఎన్నికల కోడ్‎కు విరుద్ధంగా ప్రియాంక ప్రవర్తించారని, ఆమె అవినీతికి పాల్పడ్డారని పేర్కొన్నారు.

‘‘ప్రియాంకపై శనివారం హైకోర్టులో కేసు వేశాం. ఆమె దాఖలు చేసిన నామినేషన్ పేపర్లు తప్పుదారి పట్టించేలా ఉన్నాయి. కీలకమైన చాలా విషయాలను ఆమె వెల్లడించలేదు. ఈ విషయంపై అంతకుముందు ఈసీకి ఫిర్యాదు చేసినా సరిగా స్పందించలేదు. అందువల్లే హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది” అని నవ్య చెప్పారు. కాగా.. ఈ నెల 23 నుంచి జనవరి 5 వరకు హైకోర్టుకు క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో ఆ తర్వాతే ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది. 

మరోవైపు, నవ్య పిటిషన్‎పై కాంగ్రెస్  నేతలు స్పందించారు. ఆమెది చీప్ పబ్లిసిటీ స్టంట్ అని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు ప్రమోద్ తివారీ అన్నారు. ఆమె పిటిషన్ రిజెక్ట్  అవుతుందని, హైకోర్టు ఆమెకు జరిమానా విధిస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. మరో లీడర్ మాణిక్కం ఠాగూర్  మాట్లాడుతూ పిటిషన్ వేసే హక్కు బీజేపీ అభ్యర్థికి ఉందన్నారు. కానీ, నిజం తమ వైపే ఉందని, నవ్య పిటిషన్ నిలవదని పేర్కొన్నారు.

నామినేషన్ పేపర్లలో ప్రియాంక ఏమన్నారు..?

తనకు రూ.12 కోట్లపైనే ఆస్తులు ఉన్నాయని ప్రియాంక తన నామినేషన్ పేపర్లలో వెల్లడించారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఇంటి అద్దె, బ్యాంకు వడ్డీలు, ఇతర పెట్టుబడుల ద్వారా రూ.46.39 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. ‘‘బ్యాంకు డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు, పీపీఎఫ్, భర్త రాబర్ట్ వాద్రా గిఫ్టుగా ఇచ్చిన హోండా సీఆర్‎వీ కారు, 4.4 కిలోల బంగారం.. మొత్తం రూ.4.24 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి. రూ.7.74 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. సిమ్లాలో రూ.5.63 కోట్ల విలువైన ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఉంది” అని ప్రియాంక తెలిపారు.