కోల్‌కతా: బెంగాల్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. దీదీ కోటపై పాగా వేయాలని బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. తిరిగి పవర్‌ను చేజిక్కించుకునేందుకు సీఎం మమతా బెనర్జీ పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో నందిగ్రామ్‌లో ఎన్నికల క్యాంపెయినింగ్‌కు వెళ్లిన దీదీకి గాయమైంది. ఆమె ప్రయాణిస్తున్న కారు డోరును కొందరు వ్యక్తులు కావాలనే తోయడంతో దీదీ ఎడమ కాలికి గాయమైందని తెలిసింది.
ప్రస్తుతం దీదీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె గాయంపై తృణమూల్ నేత పార్థా ఛటర్జీ స్పందించారు. దీదీని గాయపర్చగలరేమో గానీ ఆమెను గెలవకుండా ఆపలేరంటూ విపక్షాలను ఛటర్జీ దుయ్యబట్టారు. ‘పిరికివాళ్లు మమతాను ఆపాలని పదేపదే యత్నిస్తున్నారు. కానీ ఆమెను ఎవ్వరూ ఆపలేరు. దీదీ మీద జరిగిన దాడిలో కుట్ర దాగి ఉంది. ఈ ఘటనకు ముందు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీ)ని తొలగించారు. ఈ దాడిపై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం’ అని ఛటర్జీ చెప్పారు.
