- లేదా ఆయనే సీఎం పదవికి రాజీనామా చేయాలి: బీజేపీ
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌తో అనుచితంగా ప్రవర్తించిన ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్పీఏను వెంటనే తొలగించాలని బీజేపీ డిమాండ్చేసింది. లేదా కేజ్రీవాల్తన సీఎం పదవికి రాజీనామా చేయాలని కోరింది. సోమవారం ఢిల్లీ సీఎం అధికారికనివాసంలో ఆయన పీఏ బిభవ్ కుమార్ తనతో అనుచితంగా ప్రవర్తించారని, ఆ తర్వాత దాడి చేశాడని స్వాతి మలివాల్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఆమె సివిల్ లైన్స్ పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. అయితే, అధికారికంగా మాత్రం ఫిర్యాదు చేయలేదు. ఈ ఘటనపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షాజియా ఇల్మీ బుధవారం మీడియాతో మాట్లాడారు.
ఈ అంశంపై కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ మౌనంగా ఉండడం సరికాదని అన్నారు. "సీఎం కేజ్రీవాల్ నివాసంలో మలివాల్‌ను కొట్టినట్టు స్పష్టంగా ఉంది. నాకు ఆమ్ ఆద్మీ పార్టీలో అందరి గురించి బాగా తెలుసు. కేజ్రీవాల్ ఆదేశించకుండా అతని పీఏ ఎలా చేస్తారు? ఇది నిజంగా చాలా తీవ్రమైన అంశం. కేజ్రీవాల్ ఈ విషయంపై స్పందించాలని" అని ఆమె డిమాండ్ చేశారు. అలాగే, ఈ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా మోర్చా కార్యకర్తలు బుధవారం ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసం దగ్గర నిరసనకు దిగారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా మాట్లాడుతూ.. ఈ ఘటనపై కేజ్రీవాల్ ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
