తిరుమల: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం భానుప్రకాశ్ మాట్లాడుతూ.. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన రామతీర్థంలో రాముడి విగ్రహం శిరస్సు నరకడం చాలా దారుణమన్నారు. ఈ ఘటనను పరిశీలించేందుకు వెళ్తున్న జనసేన, బీజేపీ నాయకులను ఇంటి వద్దే నిర్బంధించడం సమంజసం కాదని ఫైర్ అయ్యారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. 400 ఏళ్ళ చరిత్ర కలిగిన శ్రీరాముని ఆలయంలో జరిగిన ఘటనను ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం నిందితుల్ని గుర్తించి అరెస్ట్ చేయాల్సిందిపోయి ప్రతిపక్షం మీద మాటల యుద్ధానికి దిగడం ఏంటని ప్రశ్నించారు. త్రేతా యుగంలో రాముడికి ఒక్క హనుమంతుడే ఉన్నాడని, కానీ ఈ రోజు 100 కోట్ల మంది హనుమంతుళ్లు ఉన్నారని పేర్కొన్నారు. అప్పుడు ఒక్క హనుమంతుడు తలుచుకుంటేనే లంక దహనం జరిగిందని.. ఇప్పుడు వంద కోట్ల మంది హనుమంతుళ్లు కలిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితులను గుర్తించి తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
