సాహితీ భగీరథుడు దాశరథి రంగాచార్య

తెలుగు సాహితీ లోకంలో అక్షర వాచస్పతి దాశరథి.  మార్క్స్ ను  ఆరాధిస్తూనే  శ్రీరాముడిని పూజించగలిగిన మహా పండితుడు.  వేదాలను అనువదించి భారతీయ తాత్విక మూలాలను తెలుగు ప్రజలకు పరిచయం చేసిన బహు భాషా కోవిదుడు.  తెలంగాణ  సాయుధ పోరాటంలో  పెన్ను అనే గన్నుతో  పోరాడిన సాహసి.  సాహితీ నింగిలో  ధ్రువతారగా నిలిచిన అక్షర బ్రహ్మ దాశరథి రంగాచార్య.  నిజాం నిరంకుశత్వాన్ని,  తెలంగాణకు  జరుగుతున్న అన్యాయాన్ని తన రచనలతో ఎదిరించిన అభ్యుదయవాది.  నూతన సమాజం నిర్మాణం కోసం తాపత్రయపడిన ఉద్యమశీలి.  సాంస్కృతిక స్వేచ్ఛ కోసం, అస్తిత్వం కోసం, భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి అంతంకోసం, నిజాం పాలనను తుదముట్టించడం కోసం ఆనాటి అభ్యుదయ సమాజం ఎలా సంఘటితమై పోరాడిందో ఆ పోరాట పటిమ దాశరథి రచనల్లో కనిపిస్తోంది.

అభ్యుదయ సారస్వత గోపురం

సంప్రదాయ పునాదుల మీద ఆకాశమంత ఎత్తు ఎదిగిన అభ్యుదయ సారస్వత గోపురం దాశరథి రంగాచార్య.  తన 40 ఏండ్ల  జీవితంలో అక్షర ప్రస్థానం ప్రారంభించి ఎన్నో నవలలు,  గ్రంథాలు,  కవితలు, వ్యాస సంకలనాలు రాసిన దాశరథి రంగాచార్యులు మహబూబాబాద్ జిల్లాలోని చిన్న గూడూరు  గ్రామంలో  బ్రాహ్మణ కులంలో ఆగస్టు 24,  1928న జన్మించారు.  12 ఏండ్ల వయసులోనే  పోరాట బావుటా పట్టి భారత స్వాతంత్ర్య ఉద్యమం,  నిజాం నిరంకుశ  పాలనకు వ్యతిరేకంగా పోరాడాడు. దేశ్ ముఖ్ లు, మక్తాదారులు,  పటేళ్లు, పట్వారీలు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని  ప్రజలపై జరిపిన అరాచకాలను కళ్లకు కట్టినట్లు  చెప్పేందుకే ఆయన రచనలు చేశారు. మహా రచయిత  వట్టికోట అల్వార్ స్వామి రచనలు దాశరథి రంగాచార్యులను తీవ్రంగా ప్రభావితం చేశాయి.  రంగాచార్యుల రచనలది  విశిష్ట పంథా.  కవిత్వం కన్నా  కథలు ప్రజల హృదయాలను నేరుగా తాకుతాయని ఆయన అభిప్రాయపడేవారు.  గ్రామీణ ప్రజల మట్టి బతుకులు ఆయన హృదయాన్ని కదిలించేవి.   

తెలంగాణ సాయుధ పోరాటానికి ముందున్న స్థితిగతులు, నిజాం కాలం నాటి ప్రజల దుర్భర పరిస్థితులను,  దారుణమైన బానిస బతుకుల గురించి తన 'చిల్లర దేవుళ్ళు' నవలలో వివరించారు. వేదం జీవననాదం అంటూ మెప్పించారు.  అమృతంగమయ మాధుర్యం చూపించాడు.  మాయ జలతారుతో మైమరిపించారు. అప్పటి సమాజంలో ప్రజల బానిస బతుకుల స్థితిగతులను మోదుగ పూలు నవలలో కళ్ళకు కట్టినట్లు చిత్రించాడు.  వామపక్ష తీవ్రవాదిగా ప్రజల పక్షాన నిలిచిన దాశరథి తర్వాతి కాలంలో ఆధ్యాత్మిక భావాలు అలవర్చుకుని శ్రీ మద్రామాయణం, శ్రీ మహాభారతంతో పాటు నాలుగు వేదాలను అనువదించారు.  శ్రీ మాద్రామానుజార్యులు, బుద్ధుని కథ,  మహాత్ముడు వంటి జీవిత చరిత్రలు రాశారు.  అక్షర మందాకిని,  వేదం జీవననాదం వంటి వ్యాస సంకలనాలు,  నల్లనాగు, పావని వంటి రచనలు, తెలుగులో  తర్జుమా చేసిన వేదాలు ఆయనను పరిపూర్ణ ఆధ్యాత్మికవేత్తగా దర్శింపజేస్తాయి.

ALSO READ : సిరిసిల్ల ఇంజినీరింగ్ కాలేజీలో అడ్మిషన్లు ఫుల్‌‌.. సౌలత్‌‌లు నిల్‌‌

దాశరథి రచనలు నేటితరానికి మార్గదర్శకాలు

తెలంగాణ జనజీవనం,  నిజాం నిరంకుశత్వం,  తదనంతర  రైతాంగ పోరాటం నాటి సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక అంశాల నేపథ్యంలో దాశరథి రచనలు ఒక ప్రేరణగా నిలిచాయి.  తెలంగాణ సమాజం తమ అస్తిత్వం కోసం,  సాంస్కృతిక స్వేచ్ఛకోసం, నీళ్లు,  నిధుల కోసం,  భూమికోసం,  భుక్తి కోసం చేసిన తెలంగాణ మలి దశ పోరాటాన్ని ఆయన రచనలు ప్రభావితం చేశాయి.  జనం భాషలో  గుండెలను పలకరిస్తూ, మెదళ్లకు పదును పెడుతూ ఆయన చేసిన రచనలు నేటితరానికి మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయి.  నాలుగు వేదాలు,  10 ఉపనిషత్తులు,  రామాయణ,  మహాభారత, భాగవతాలను సరళమైన  తెలుగు వచనంలో రాసి తెలుగుజాతి  శ్రేయస్సు కోసం పనిచేశారు. 20వ శతాబ్దం సాహిత్యవనంలో  మోదుగ పువ్వుగా నిలిచిన దాశరథి 2015 జూన్ 8న అస్తమించారు.    తెలంగాణ అస్తిత్వం కోసం రచనలు చేసిన దాశరథి తెలుగు సాహితీ నింగిలో ధ్రువతారగా నిలిచారు.

- అంకం నరేష్, సోషల్​ ఎనలిస్ట్​