బిర్సా ముండా.. నిను చూసి గర్విస్తోంది భారత జెండా

బిర్సా ముండా.. నిను చూసి  గర్విస్తోంది భారత జెండా

ఆదివాసీ, గిరిజన హక్కుల కోసం గర్జించిన గొంతుక.. బిర్సా ముండా 
జమీందార్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన శూరుడు.. బిర్సా ముండా 
తెల్లవారి పాలనపై తిరుగుబాటు జెండా ఎగరేసిన ధీరుడు.. బిర్సా ముండా 
రైతులను వేధించిన వడ్డీ వ్యాపారుల పాలిట సింహస్వప్నం.. బిర్సా ముండా 

ఆదివాసీ, గిరిజన  నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నేటి యువతరం ఆయన గురించి తప్పకుండా  తెలుసుకోవాలి. నేడు (జూన్ 9) ఆ మహనీయుడి వర్ధంతి.   ఈసందర్భంగా బిర్సా జీవితంలోని పలు కీలక ఘట్టాలను తెలుసుకుందాం..  

క్రైస్తవ మిషనరీ పాఠశాలలో..

బిర్సా ముండా 1875 సంవత్సరం నవంబరు 15న జార్ఖండ్ లోని ఉలిహతు గ్రామంలో జన్మించారు. పశ్చిమ సింగ్భమ్ జిల్లాలోని ఓ క్రైస్తవ మిషనరీ పాఠశాలలో చదువుకున్నారు. అక్కడ పాశ్చాత్య దేశాల చరిత్ర, ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని గురించి తెలుసుకున్నారు.  ఆ ఫలితంగానే బ్రిటీషర్లు భారతదేశంలో సాగిస్తున్న దురాక్రమణ, సామ్రాజ్యవాద పాలనపై అవగాహన పెంచుకున్నారు.  తెల్లవారి పాలనపై పోరాడనిదే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించదని నిర్ణయించుకున్నారు.  22 ఏళ్ల వయసు ( 1897)లోనే  బ్రిటీషర్లపై యుద్ధం ప్రకటించారు. వారికి నిద్ర లేకుండా చేశారు. ఆదివాసీ, గిరిజనుల ఆత్మాభిమానం కోసం గళమెత్తారు.  బ్రిటీష్ వారి నిరంకుశ చట్టాలకు వ్యతిరేకంగా గళమెత్తుతూ  భారత స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. చోటా నాగపూర్ ప్రాంతంలో ఆదివాసీల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేశారు.  కుంతి, తామర్, బసియా, రాంచీ ప్రాంతాలు కేంద్రంగా మిలిటెంట్ ఉద్యమాన్ని నడిపారు.  దీంతో వణికిపోయిన బ్రిటీష్ పాలకులు దొంగ దెబ్బ తీశారు.

రూ.500 రివార్డు ప్రకటించిన బ్రిటీషర్లు..

1900  జనవరి 5న బిర్సా ముండా ఇద్దరు అనుచరులను దారుణంగా కాల్చి చంపారు. ఈ సంఘటన బిర్సా ముండా మనసును ఎంతో  కలచివేసింది.  ఆ తర్వాత.. బిర్సా ముండాను చంపిన వారికి రూ.500 రివార్డు ఇస్తామని బ్రిటీష్ గవర్నర్లు ప్రకటించారు.  మరోవైపు బ్రిటీష్ బలగాలు కూడా ఆయన కోసం దుంబర్ హిల్ అనే పర్వత ప్రాంతంలో ప్రత్యేక సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈక్రమంలో తారసపడిన బిర్సాపై బ్రిటీష్ బలగాలు కాల్పులు జరిపారు. అయినా చాకచక్యంగా తప్పించుకున్న బిర్సా.. జంకోపాయి అనే అటవీ ప్రాంతంలో 1900 మార్చి 3న అరెస్టు అయ్యారు. అరెస్టు అయిన మూడు నెలల్లోనే (జూన్ 19న) రాంచీ  జైలులో అనుమానాస్పద  స్థితిలో  ఆయన చనిపోయారు.  జైలులో ఉండగా బిర్సా ముండాకు విషం ఇచ్చి ఉంటారని చరిత్రకారులు చెబుతారు.  వీర మరణం పొందే సమయానికి బిర్సా ముండా వయసు 25 ఏళ్లు మాత్రమే. ఇంత చిన్న వయసులో  దేశం కోసం ప్రాణాలర్పించిన బిర్సా ముండా ఈతరానికి స్ఫూర్తి ప్రదాత.  ఆయన  చేపట్టిన ఉద్యమ  ఫలితంగానే తదనంతర కాలం(1908)లో బ్రిటీష్ ప్రభుత్వం చోటా నాగ్ పూర్ కౌలు హక్కుదారుల చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ ఆ చట్టం ద్వారా కూడా ఆదివాసీలకు పూర్తి న్యాయం జరగలేదు.