హైదరాబాద్, వెలుగు: గవర్నమెంట్ స్కూళ్లలో బయోమెట్రిక్ అటెండెన్స్ నుంచి స్టూడెంట్స్‌కు మినహాయింపు ఇచ్చారు. కేవలం టీచర్లకే బయోమెట్రిక్ అటెండెన్స్ కొనసాగించాలని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది. టీచర్లు బడికి రెగ్యులర్‌గా వస్తే.. పిల్లల అటెండెన్స్ అదే పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 2018 అక్టోబర్ 1 నుంచి టీచర్లు, స్టూడెంట్స్‌కు బయోమెట్రిక్ విధానం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. 9,349 ప్రభుత్వ, లోకల్‌బాడీ స్కూళ్లు, కేజీబీవీల్లో ఈ విధానం కొనసాగుతోంది. ప్రతి వంద మందికి ఒక డివైజ్ చొప్పున12,705 బయోమెట్రిక్ పరికరాలను స్కూళ్లకు అందించారు. ఇటీవల 13 జిల్లాల్లో బయోమెట్రిక్ విధానంపై హెడ్మాస్టర్ల నుంచి అధికారులు ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. ఈ విధానంతో టీచర్ల అటెండెన్స్ పెరిగిందని, ఇలాగే కొనసాగించాలని డీఈవోలు రిపోర్టు ఇచ్చారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది అన్ని జిల్లాల్లో ఈ విధానం అమలు చేయాలని నిర్ణయించారు.
పిల్లల విషయంలో ఇబ్బందులు
పిల్లల బయోమెట్రిక్ అటెండెన్స్‌కు సంబంధించి చాలా స్కూళ్లలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దాంతో స్టూడెంట్స్‌ను ఈ విధానం నుంచి మినహాయించాలని నిర్ణయించారు. ఈ మేరకు స్టూడెంట్స్ కోసం ఏర్పాటు చేసిన డివైజ్‌లను హైదరాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు తరలించి, అక్కడి టీచర్లకు బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని డీఈవోలకు ఆదేశాలు వచ్చాయి. ఆయా జిల్లాల పరిధిలో సుమారు3,600 స్కూళ్లున్నాయి.
