ఖాతాలోని డబ్బు కోసం బ్యాంకుకే శవాన్ని తీసుకెళ్లిన గ్రామస్తులు

ఖాతాలోని డబ్బు కోసం బ్యాంకుకే శవాన్ని తీసుకెళ్లిన గ్రామస్తులు

చ‌నిపోయిన వృద్ధుడి అంత్య‌క్రియ‌ల నిమిత్తం అత‌ని అకౌంట్ లో ఉన్న డ‌బ్బుకోసం బ్యాంకు అధికారుల‌ను సంప్ర‌దించారు ఇరుగుపొరుగువారు. అయితే అత‌ని సంత‌కం లేకుండా అకౌంట్ లో ఉన్న‌ డ‌బ్బులు ఇచ్చేది లేదంటూ అధికారులు చెప్ప‌డంతో వృద్ధుడి డెడ్‌బాడీని బ్యాంకులోనే ఉంచి నిర‌స‌న తెలిపారు. అత‌ని అంత్య‌క్రియ‌ల‌కు కూడా ఆ డ‌బ్బు ఉప‌యోగ‌ప‌డ‌క‌పోతే దాని ప్ర‌యోజ‌న‌మేంట‌ని నిల‌దీశారు. బీహార్ రాష్ట్రం పాట్నా స‌మీపంలోని సింగ్రియావాన్ లో జ‌రిగిందీ సంఘ‌ట‌న‌.

ఆ ప్రాంతానికి చెందిన మ‌హేశ్ యాద‌వ్(60) అనే వ్య‌క్తి దీర్ఘ‌కాలంగా ఏదో జ‌‌బ్బుతో బాధ‌ప‌డుతున్నాడు. ఈ నేప‌థ్యంలో గ‌త మంగ‌ళ‌వారం రాత్రి నిద్ర‌లోనే మ‌ర‌ణించాడు. అత‌నికి భార్యాపిల్ల‌లు, బంధువులు కూడా ఎవ‌రూ లేక‌పోవ‌డంతో స్థానికులు అత‌ని అంత్య‌క్రియ‌ల‌కు సిద్ధం చేశారు. అత‌ని బ్యాంకు అకౌంట్  లో రూ.1.18 ల‌క్షలు ఉన్నాయ‌ని పాస్ బుక్ ద్వారా తెలుసుకున్న స్థానికులు.. సంబంధిత కెన‌రా బ్యాంకుకు వెళ్లి ఖ‌ర్చుల కోసం రూ.20,000 ఇవ్వ‌మ‌ని బ్యాంకు మేనేజ‌ర్ ను కోరారు.

అందుకు మేనేజ‌ర్ ఒప్పుకోక‌పోవ‌డంతో.. గ్రామ‌స్తులు మహేశ్ మృతదేహాన్ని బ్యాంకు లోపలకి తీసుకెళ్లి, అంత్యక్రియలకు డబ్బు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. సంతకాలు లేకుండా డబ్బు ఇవ్వ‌లేమ‌ని బ్యాంక్ అధికారులు న‌చ్చ‌చెప్పే ప్ర‌య‌త్నం చేయ‌గా.. మృత‌దేహాన్ని అక్క‌డే ఉంచి నిర‌స‌న తెలిపారు. చాలా గంట‌లుగా మృతదేహం అక్క‌డే ఉండ‌డంతో.. విసుగెత్తిన బ్యాంక్ మేనేజర్.. చివరకు సిఎస్ఆర్ నిధుల నుండి రూ .10,000 ఇవ్వాలని నిర్ణయించారు. గ్రామ సర్పంచ్  మరో రూ .5 వేలు ఇవ్వ‌డంతో  స్థానికులు మహేశ్  ద‌హ‌న‌సంస్కారాలు పూర్తి చేశారు. కాగా.. మ‌హేశ్ యాద‌వ్ బ్యాంకు ఖాతాకు సంబంధించి కెవైసి విధానాన్ని పూర్తి చేయాలని నెలల తరబడి కోరినప్పటికీ, తన జీవిత పొదుపును ఎవరైనా తీసివేస్తారనే భయంతో అతను దానిని తిరస్కరించాడని బ్యాంకు మేనేజ‌ర్ తెలిపారు.