ఫార్ములా ఈ రేస్ కేసు: ఏసీబీ ఆఫీస్కు వచ్చినట్టే వచ్చి తిరిగి వెళ్లిపోయిన కేటీఆర్ !

హైదరాబాద్: బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయం దగ్గర హైడ్రామా చోటుచేసుకుంది. ఏసీబీ ఆఫీస్ నుంచి కేటీఆర్ వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణకు హాజరు కాకుండానే కేటీఆర్ తిరిగి వెళ్లిపోవడం గమనార్హం. అరగంటకు పైగా పోలీసులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. లాయర్ను అనుమతిస్తేనే విచారణకు వస్తానని పోలీసుల ముందు కుండబద్ధలు కొట్టి కేటీఆర్ అక్కడ నుంచి వెళ్లిపోయారు. అంతకు ముందు జరిగింది ఏంటంటే.. ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణకు హాజరయ్యేందుకు తన కారులో లాయర్తో కలిసి కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. కేటీఆర్ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

విచారణకు కేటీఆర్ ఒక్కరే హాజరు కావాలని అధికారులు స్పష్టం చేశారు. లాయర్ను అనుమతించేది లేదని కేటీఆర్కు ఏసీబీ అధికారులు తేల్చి చెప్పారు. కేటీఆర్ కూడా లాయర్ విషయంలో వెనక్కి తగ్గలేదు. తన వెంట లాయర్ను అనుమతిస్తేనే విచారణకు హాజరవుతానని కేటీఆర్ పట్టుబట్టారు. పోలీసులుపై నమ్మకం లేకనే లాయర్తో వచ్చానని, తనతో పాటు లాయర్ ను విచారణకు అనుమతించాలని కేటీఆర్ సుమారు అరగంట నుంచి ఏసీబీ ఆఫీస్ ముందే వేచి చూసి.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయినా లాయర్తో విచారణకు వస్తే ఇబ్బంది ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు.

Also Read :- ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు

హైకోర్టులో తీర్పు రిజర్వులో ఉండగా మళ్లీ విచారణ ఎందుకని నిలదీశారు. ఎన్ని రైడ్స్ చేసినా, డ్రామాలు చేసినా ఇబ్బంది లేదని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పట్నం నరేందర్ రెడ్డి విషయంలో తప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేశారని ఆయన ఆరోపించారు. తన ఇంటిపై రైడ్స్ చేయాలని చూస్తున్నారని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. తన లాయర్ ముందే విచారించాలని కేటీఆర్ పట్టుబట్టడం, తన లాయర్ను ఎందుకు అనుమతించరని ప్రశ్నించడంతో ఏసీబీ ఆఫీస్ ముందు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏసీబీ ఆఫీస్ నుంచి కేటీఆర్ నేరుగా తెలంగాణ భవన్ కు వెళ్లిపోయారు.