డీజిల్​ ఆటోలు ఔటర్​ దాటాల్సిందే..సీఎం ఆదేశాలతో ఆర్టీఏ కార్యాచరణ

  • గ్రేటర్​లో 15 వేల ఆటోలు 
  • చర్చిస్తరు..నచ్చజెప్తరు.. పంపిస్తరు 
  • అయినా వినకపోతే ఫైన్లు.. సీజ్​
  • ఎలక్ట్రిక్​ ఆటోల కొనుగోలులో డిస్కౌంట్​?
  • ఇప్పటికే ట్యాక్స్​లేదు.. రిజిస్ట్రేషన్ ​ఫ్రీ 
  • ఎక్స్ఛేంజ్​లో ఎలక్ట్రిక్​ ఆటోలు ఇవ్వాలంటున్న సంఘాల నేతలు  

హైదరాబాద్​సిటీ, వెలుగు : సిటీలో కాలుష్యం వెదజల్లుతున్న డీజిల్​ఆటోలను ఔటర్​రింగ్​రోడ్​అవతలకు తరలించాలంటూ సీఎం ఆదేశించడంతో ఆ ఏర్పాట్లలో ఆర్టీఏ అధికారులు నిమగ్నమయ్యారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్​ఢిల్లీ మాదిరిగా కాలుష్యం బారిన పడకుండా డీజిల్​వాహనాలను తగ్గించే పనిలో పడ్డారు. అలాగే ఎలక్ట్రిక్​వాహనాలను ప్రోత్సహించాలని సంకల్పించారు. ఈ నేపథ్యంలో సిటీలోని డీజిల్​ఆటోలతో పాటు ఇతర జిల్లాల నుంచి ఇక్కడ నడుస్తున్న ఆటోల లెక్కలు తీస్తున్నారు.

హైదరాబాద్​లో 22 ఏండ్లుగా డీజిల్ ఆటోలపై నిషేధం ఉన్నా రోజు రోజుకూ వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. కొందరు ఇతర జిల్లాల్లో ఆటోలు కొని నగరానికి తీసుకువచ్చి నడుపుతున్నారు. దీనిపై అధికారులకు ఇంతకుముందే సమాచారం ఉన్నా పట్టించుకోలేదు. ఇప్పుడు సీఎం ఆదేశించడంతో యాక్షన్​కు సిద్ధమవుతున్నారు. 

కాలం చెల్లిన ఆటోలు 2 వేలు  

గ్రేటర్​లో అన్ని ఆటోలు కలిపి1.10 లక్షల వరకు ఉన్నాయి. 2002లో ఆటోలపై నిషేధం విధించే నాటికి 50 వేల నుంచి 60 వేల వరకు మాత్రమే ఉండగా, వివిధ సందర్భాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఉపాధి కోసం 25 వేల ఆటోలకు పర్మిషన్​ఇచ్చారు.  మిగిలినవన్నీ ఇతర జిల్లాల నుంచి వచ్చి దొడ్డిదారిన తిరుగుతున్నవేనని తేల్చారు. ఇందులో డీజిల్​ఆటోలు 15వేలకుపైగానే ఉంటాయని అధికారులు అంటున్నారు. 15 ఏండ్లు దాటిన ఆటోలు రెండు వేలలోపు ఉంటాయి.  వీటన్నింటినీ ఔటర్​దాటించాలన్న లక్ష్యంతోనే అధికారులు పని చేస్తున్నారు. 

వెళ్లడానికి ఇష్టపడరు..చర్చించి పంపిస్తాం

ఆటోల తరలింపు విషయమై ఆటో సంఘాల లీడర్లతో చర్చలు జరుపుతామని అధికారులు అంటున్నారు. నగరాన్ని కాపాడుకోవాలంటే పొల్యూషన్​పెరగకుండా చూసుకోవాలని అందులో భాగంగా డీజిల్ వాహనాల వచ్చే తిప్పలను, సీఎం ఆదేశాల గురించి వివరిస్తామంటున్నారు. అందరి అంగీకారంతోనే ఆటోలను బయటకు పంపేలా చర్యలు తీసుకుంటామని అంటున్నారు.

Also Read :- ట్రిపుల్​ ఆర్​​ మొత్తానికి ఓకే చెప్పండి

వారు ఉపాధి కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రత్యామ్నాయంగా ఎలాంటి సహకారం అందివ్వాలన్నదాని గురించి ప్రభుత్వంతో మాట్లాడతామంటున్నారు. మరోవైపు ఇతర జిల్లాల ఆటోలు, 15 ఏండ్లు దాటిన ఆటోల విషయంలో  కఠినంగా వ్యవహరిస్తామంటున్నారు. వేరే జిల్లాకు సంబంధించిన ఆటోలు సిటీలో తిరుగుతున్నట్టయితే ఫైన్లు వేస్తామంటున్నారు. వినకుండా మళ్లీ వచ్చి దొరికితే సీజ్​చేస్తామని హెచ్చరిస్తున్నారు. 

ఇతర జిల్లాలవే అధికం

ప్రస్తుతం సిటీలో తిరిగే డీజిల్​ఆటోల్లో అధికంగా పక్కజిల్లాల నుంచి వచ్చినవే ఉంటున్నాయని అధికారులు చెప్తున్నారు.  భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్​నగర్, మేడ్చల్​ జిల్లాలకు చెందినవి ఎక్కువగా ఉన్నాయి. వీటిని  పంపిస్తే సగం సమస్య తీరిపోతుందంటున్నారు. మిగిలిన వాటిని తిరగకుండా నియంత్రించాలంటే ఏదో ఒక లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని ఉన్నతాధికారులు తెలిపారు.

ఔటర్​ దాటిస్తే ప్రోత్సాహాకాలివి

డీజిల్​ఆటోలు ఔటర్​దాటి పంపిస్తే ప్రభుత్వం వారికి అవసరమైన సాయం చేసేందుకు సిద్ధంగా ఉందని కొందరు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్​ఆటోలు కొంటే ట్యాక్స్​ ఫ్రీతో పాటు రిజిస్ట్రేషన్​మినహాయింపు ఇస్తున్నారు. ఒక వేళ ఎవరైనా పాత ఆటో స్ర్కాప్​చేసి ఎలక్ట్రిక్​ఆటో కొనాలనుకుంటే సబ్సిడీ ఇచ్చే విషయంపై ప్రభుత్వం ఆలోచిస్తోందని అధికారులు తెలిపారు.