అల్లు అర్జున్‎పై కేసు కొట్టివేసిన ఏపీ హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో స్టార్ హీరో అల్లు అర్జున్‌కు భారీ ఊరట దక్కింది. అల్లు అర్జున్‎పై నంద్యాల పోలీస్ స్టేషన్‎లో నమోదైన కేసును కొట్టివేయాలని పోలీసులను హై కోర్టు ఆదేశించింది. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్‎పై కేసు నమోదైన విషయం తెలిసిందే. 

ఎన్నికల సమయంలో నంద్యాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత శిల్పా రవి ఇంటికి అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా వెళ్లారు. అల్లు అర్జున్ రాక సందర్భంగా నంద్యాలలో అతడి అభిమానులు పెద్దఎత్తున గుమిగూడారు. అల్లు అర్జున్‎ను  చూసేందుకు వేల సంఖ్యలో స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ శిల్ప రవి ఇంటి వద్దకు వచ్చారు. 

ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా.. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా అల్లు అర్జున్, శిల్పా రవి నంద్యాలలో ర్యాలీ నిర్వహించారని రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎలక్షన్ నిబంధనలకు విరుద్ధంగా జనసమీకరణ చేశారని ఆర్వో కంప్లైంట్ ఇచ్చారు. ఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు అల్లు అర్జున్, శిల్పా రవి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. 

దీంతో హీరో అల్లుఅర్జున్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. నంద్యాల పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం 2024, నవంబర్ 6న తీర్పు వెలువరించింది. అల్లు అర్జున్ పై నమోదైన కేసును కొట్టివేయాలని పోలీసులను ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో అల్లు అర్జున్‎కు బిగ్ రిలీఫ్ లభించింది.