SMAT 2024: భువనేశ్వర్ కుమార్ హ్యాట్రిక్.. స్పెల్ చూస్తే మైండ్ పోవాల్సిందే

టీమిండియా ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఎప్పుడూ ఫామ్ లోనే ఉంటాడు. అతనికి భారత జట్టులో చోటు దక్కపోయినా ఐపీఎల్, దేశవాళీ క్రికెట్ లో తన మార్క్ చూపిస్తాడు. తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హ్యాట్రిక్ సాధించి అందరి చూపు ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నాడు. జార్ఖండ్‌ తో జరిగిన మ్యాచ్ లో భువనేశ్వర్ ఈ ఘనత అందుకున్నాడు. హ్యాట్రిక్ తో పాటు అద్భుతమైన స్పెల్ (4-1-6-3) వేయడం విశేషం. ఈ స్వింగ్ కింగ్ ధాటికి ఓడిపోయే మ్యాచ్ లో తన జట్టు ఉత్తర ప్రదేష్ 10 పరుగుల తేడాతో గెలిచింది.

ఇన్నింగ్స్ 16 వ ఓవర్ వరకు మ్యాచ్ జార్ఖండ్‌ చేతిలోనే ఉంది. 17 వ ఓవర్లో భువనేశ్వర్ కుమార్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఈ ఓవర్ లో తొలి మూడు బంతుల్లోనే రాబిన్‌ మింజ్‌, బాల్‌ కృష్ణ, వివేకానంద్‌ తివారీలను అవుట్‌ చేశాడు. ఆ ఆతర్వాత మూడు బంతులను డాట్ బాల్స్ గా వేశాడు. దీంతో ఈ ఓవర్ హ్యాట్రిక్ తో పాటు మైడెన్ ఓవర్ బౌల్ చేశాడు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఉత్తర ప్రదేశ్ 20 ఓవర్లలో 160 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఝార్ఖండ్ 150 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

భువనేశ్వర్ కుమార్ కు స్పెల్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇటీవలే జరిగిన ఐపీఎల్ 2024 మెగా వేలంలో భువీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.10.75 కోట్లకు దక్కించుకుంది. భువనేశ్వర్ కోసం ఎక్కడా రాజీపడలేదు బెంగళూరు. అతని కోసం ఎన్ని జట్లు పోటీకి వచ్చినా తగ్గేదే లేదన్నట్టు కొనుగోలు చేసింది. 2024 ఐపీఎల్ సీజన్ లో భువీ సన్ రైజర్స్ తరపున ఆడాడు. చాలా సంవత్సరాల తర్వాత అతను హైదరాబాద్ జట్టును వీడి బయటకు రావడం ఇదే తొలిసారి.