సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన భూపేంద్ర పటేల్‌

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన భూపేంద్ర పటేల్‌

గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్‌ ఈ రోజ మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌ సింగ్ చౌహాన్‌, గోవా సీఎం ప్రమోద్ సావంత్, పలువురు బీజేపీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం అనంతరం హోం మంత్రి అమిత్‌ షా ఆయనకు అభినందనలు తెలిపారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ కూడా కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు.

వచ్చే ఏడాదిలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో విజయ్ రూపానీ సీఎం పదవికి శనివారం మధ్యాహ్నం సడన్‌గా రాజీనామా చేశారు. దీంతో ఆదివారం శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటు చేసి 59 ఏండ్ల భూపేంద్ర పటేల్‌ను కొత్త సీఎంగా ఎన్నుకున్నారు. అయితే ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న నితిన్ పటేల్‌, రాష్ట్ర మంత్రి ఆర్ సీ ఫాల్దూ, కేంద్రమంత్రులు మన్సుఖ్ మాండవీయ, పరుషోత్తమ్ రూపాలా, బీజేపీ స్టేట్ చీఫ్ సీఆర్ పాటిల్, పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గోర్ధన్ జడాఫియా పేర్లు ప్రధానంగా ప్రచారంలోకి వచ్చినప్పటికీ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భూపేంద్ర పటేల్‌ను బీజేపీ కేంద్ర నాయకత్వం ఎంపిక చేయడం ఎవరూ ఊహించని పరిణామం.

2016లో సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు నాడు సీఎంగా ఉన్న అనందీ బెన్ పటేల్‌ను తొలగించి విజయ్ రూపానీకి బాధ్యతలు అప్పగించింది బీజేపీ. 2017 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రూపానీనే గుజరాత్‌లో బీజేపీని నడిపించారు. ఆ సమయంలో పటేల్‌ రిజర్వేషన్ల ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడంలో ఆయన సక్సెస్ అయ్యారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కంట్రోల్‌ చేయడంలో విఫలం కావడం సహా వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యలు లాంటి వాటిని పరిగణనలోకి తీసుకుని బీజేపీ కేంద్ర నాయకత్వం ఇప్పుడు సీఎం మార్పు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.