ఏటా 2.5 లక్షల కోట్లు ఇవ్వాలి

  • కేంద్ర ప్రభుత్వానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాల మూలధన వ్యయం కోసం ఏటా రూ.2.5 లక్షల కోట్ల ప్రత్యేక సాయం అందించాలని, రాష్ట్రాల ఆర్థిక స్వయంపత్రిపత్తికి తగిన అనుమతులు ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కేంద్రాన్ని కోరారు. రాజస్థాన్ లోని జైసల్మీర్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నిర్వహించిన ప్రీబడ్జెట్ సమావేశంలో భట్టి పాల్గొని మాట్లాడారు. ఆదాయ పన్ను చట్టంలో సంస్కరణలు అవసరమని.. ప్రస్తుత పన్ను వ్యవస్థ క్లిష్టంగా ఉండటంతో వ్యక్తులు, వ్యాపారాలకు సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. పన్ను శ్లాబుల సరళీకరణ, కార్పొరేట్ పన్ను రేట్ల తగ్గింపు అవసరం ఉందన్నారు. ఆదాయపు పన్ను, జీఎస్టీ ఫైలింగ్ ప్రక్రియలను సరళీకరించడం చాలా ముఖ్యమన్నారు. ప్రపంచ అనిశ్చితులు,  దేశీయ ఆర్థిక మందగమనం పరిస్థితుల్లో మూలధన వ్యయ (క్యాపిటల్ ఎక్స్​పెండిచర్) ప్రోత్సాహం అవసరం ఉందన్నారు.

ఎంఎస్ఎంఈలు దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన బలమని.. వాటి ఎదుగుదల కోసం తగిన విధానాలు అవసరమన్నారు. తెలంగాణ ఎంఎస్ఎంఈ టెక్నాలజీ అభివృద్ధి నిధిని ఏర్పాటు చేయాలని తమ రాష్ట్రం ప్రతిపాదిస్తోందన్నారు. ఐటీఐలను ఆధునీకరించాలని.. ఏఐ, పునరుత్పాదక శక్తి, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలలో యువతకు నైపుణ్యం కల్పించేందుకు తగిన నిధులు కేటాయించాలన్నారు. గిగ్ కార్మికులకు సరైన భద్రతకు జాతీయ విధానాన్ని రూపొందించాలన్నారు. సీఎస్‌‌ఎస్ కింద తెలంగాణకు తగిన నిధులు కేటాయించాలన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం పెండింగ్ బకాయిల చెల్లించాలన్నారు. తెలంగాణలో వెనుకబడి ఉన్న జిల్లాలకు పర్యావరణ అనుకూలమైన మౌలిక వసతులు అభివృద్ధికి నిధులు అందించాలని భట్టి కోరారు.  ఉపాధి హామీ నిధుల వినియోగంలో మరింత సౌలభ్యం తీసుకురావాలన్నారు.