బిజినెస్ డెస్క్, వెలుగు: ‘ఒక ఫోన్ కాల్ మీ జీవితాన్నే మార్చేస్తుంది’ అనే పాత కాలపు యాడ్ ఒకటి గుర్తుండే ఉంటుంది. స్టార్టప్ కంపెనీ భారత్‌పే ఫౌండర్ అశ్నీర్ గ్రోవర్ జీవితం కూడా ఇలా ఒక్క ఆడియో కాల్‌తో టర్న్ అయ్యింది. కోటక్ బ్యాంక్ ఎంప్లాయ్‌ని గ్రోవర్ తిడుతున్నట్టు ఉన్న ఓ ఆడియో క్లిప్ రెండు నెలల క్రితం ట్విటర్‌లో హల్ చల్ చేసింది. ఆన్‌లైన్ బ్యూటి ప్రొడక్ట్స్ కంపెనీ నైకా ఐపీఓలో ఇన్వెస్ట్ చేసేందుకు రూ. 500 కోట్ల ఫండింగ్‌ను ఇవ్వడానికి చివరి నిమిషంలో కోటక్ బ్యాంక్ నిరాకరించిందనే వార్తలొచ్చాయి. ఈ ఆడియో క్లిప్ ఫేక్ అని అశ్నీర్ కొట్టిపారేసినా, ఆ తర్వాత తన ట్వీట్‌ను ఆయనే తొలగించారు కూడా. ఈ సంఘటన తర్వాత నుంచి భారత్‌పేలో ఫౌండర్లు, ఇన్వెస్టర్ల మధ్య గొడవలు మరింత ముదిరాయి.
ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు..
అశ్నీర్ గ్రోవర్, కంపెనీ బోర్డు మధ్య జరిగిన సంఘటనలు గమనిస్తే ఓ సినిమా స్టోరీలా అనిపించకమానదు. కంపెనీ ఫండ్స్‌ను అశ్నీర్ భార్య మాధురి జైన్ గ్రోవర్ సొంత పనులకు వాడుకున్నారనే ఓ ఇండిపెండెంట్ ఆడిట్ కంపెనీ తన రిపోర్ట్స్‌ను బయటపెట్టింది. కంపెనీలో హెడ్ ఆఫ్ కంట్రోల్‌గా అప్పుడు ఆమె పనిచేస్తున్నారు. ఆ టైమ్‌లో అశ్నీర్ వాలంటరీ లీవ్‌లో ఉండడాన్ని గమనించాలి. గ్రోవర్ ఫ్యామిలీ ఫేక్ వెండర్లను క్రియేట్ చేసి కంపెనీ ఫండ్స్‌ను తమ సొంత అకౌంట్లకు పంపుకున్నారని, ఫేక్ ఇన్‌వాయిస్‌లు క్రియేట్ చేశారనే ఈ రిపోర్ట్‌లో పేర్కొంది. ఈ విషయాలన్ని గత రెండు నెలల్లోనే జరగడం విశేషం. గత కొంత కాలం నుంచి కంపెనీలోని ఫౌండర్లకు, మెజార్టీ షేర్ హోల్డింగ్ కంపెనీ సెకోవియాకు మధ్య గొడవలు జరుగుతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అశ్నీర్ గ్రోవర్ బిహేవియర్ రూడ్‌గా ఉంటుందని ఈ కంపెనీకి చెందిన కొంత మంది ఉద్యోగులు కూడా చెబుతున్నారు. అందుకే ఆయనకు కంపెనీ సీఈఓ పదవిని బోర్డు ఇవ్వలేదని, ఎండీగా మాత్రమే నియమించిందని గుర్తు చేస్తున్నారు. ఇండిపెండెంట్ ఆడిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నుంచి గ్రోవర్‌ను బయటకు పంపాలని భారత్‌పే బోర్డు టార్గెట్ పెట్టుకుందని అనొచ్చు.
అవకతవకలు జరిగాయ్!..
ఫేక్ వెండర్లు ద్వారా రూ. 53 కోట్లను కంపెనీ అకౌంట్ నుంచి గ్రోవర్ ఫ్యామిలీ మరల్చిందని ఈ రిపోర్ట్‌లో అల్వార్జ్ అండ్ మార్సల్ పేర్కొంది. డైరెక్ట్‌గా తీసుకున్న ఉద్యోగులను కూడా కన్సల్టింగ్ కంపెనీల ద్వారా తీసుకున్నామని చూపించి రూ. కోట్ల డబ్బును ఇతర అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేశారని ఆరోపించింది. మాధురి హోమ్‌టౌన్ పానిపట్‌లోని వెండర్ల కోసం రూ. 3.77 కోట్లను ఖర్చు చేశారని తెలిపింది. ఇలా కంపెనీలో ఆర్థిక పరమైన అవకతవకలు బయటపడడం ఇదేం మొదటి సారి కాదు. లేని వెండర్లను క్రియేట్ చేసి రూ. 51 కోట్లను కంపెనీ చెల్లించిందని కిందటేడాది అక్టోబర్‌లో జీఎస్‌టీ ఇంటెలిజెన్స్ కూడా గుర్తించింది.
టార్గెట్ గ్రోవర్..
ఆడిట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కంపెనీ సీఈఓ సుహైల్ సమీర్‌ను తొలగించాలని అశ్నీర్ గ్రోవర్ బోర్డుకి ఫిబ్రవరి 2 న లెటర్ రాశారు. దీనిపై బోర్డు స్పందించలేదు. కంపెనీ నుంచి వెళ్లిపోవడానికి రెడీ అని గ్రోవర్ చెప్పుకున్నారు. కానీ, తన వాటాకు రూ. 4 వేల కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని వార్తలొచ్చాయి. కానీ, బోర్డు ఈ విషయాన్ని కూడా పట్టించుకోలేదు. ఆయనపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఫిబ్రవరి 23 న కంపెనీ నుంచి మాధురి జైన్‌ను బోర్డు తొలగించింది. భారత్‌పే కార్పొరేట్ గవర్నెన్స్‌పై సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్‌ఐఏసీ) కు గ్రోవర్ వెళ్లారు. కానీ, అక్కడా ఆయనకు చుక్కెదురయ్యింది. ఈ ఫిర్యాదును ఎస్‌ఐఏసీ కొట్టేసింది. దీంతో మార్చి 1 న అశ్నీర్ రాజీనామా చేశారు. దీనిపై కంపెనీ బోర్డు అంతే వేగంగా స్పందించింది. ఆయన షేర్లను తిరిగి తీసుకోవడం వంటి లీగల్ చర్యలు చేపడతామని ప్రకటించింది. కోటక్ బ్యాంక్‌లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా పనిచేసిన అశ్నీర్, తన అనుభవంతో భారత్‌పేను 2.85 బిలియన్ డాలర్ల కంపెనీగా మార్చగలిగారు. సెకోవియా వంటి పెద్ద ఇన్వెస్టర్లను కంపెనీలోకి తెచ్చారు. సక్సెస్ తలకెక్కడంతో ఆయన బిహేవియర్ మారిపోయిందని అంటారు.
తెరపైకి కొత్త గొడవ..
అశ్నీర్ గ్రోవర్ రాజీనామాతో భారత్‌పే గొడవ ముగుస్తుం దని భావిస్తున్నప్పటికీ, ఆ అవకాశం కనిపించడం లేదు. కంపెనీని అశ్నీర్ గ్రోవర్, శాశ్వత్ నక్రానితో కలిసి భావిక్ కొలాడియా ఏర్పాటు చేశారు. కానీ, యూఎస్‌లో ఓ క్రెడిట్ కార్డు ఫ్రాడ్‌లో చిక్కుకోవడంతో కొలాడియా తన వాటాను మిగిలిన ఇద్దరూ ఫౌండర్లతో పంచుకున్నారని ఈ విషయం తెలిసిన వ్యక్తులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఈ–మెయిల్స్ కూడా ఉన్నాయని అంటున్నారు. ఈ వాటా ఎలా ట్రాన్స్‌ఫర్ అయ్యిందనే అంశంపై మళ్లీ గొడవ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
