న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బ్యాంక్‌లు బంద్ చేపడుతున్నాయి. వచ్చే వారం కేంద్ర ట్రేడ్ యూనియన్లు చేపడుతోన్న ఆల్ ఇండియా జనరల్ స్ట్రయిక్‌లో పాల్గొనాలని బ్యాంక్ యూనియన్లు కూడా నిర్ణయించాయి. ఈ నెల 8న(బుధవారం) డ్యూటీలకు రావొద్దని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్(ఏఐబీఈఏ), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఈఎఫ్‌ఐ) వంటి బ్యాంక్ యూనియన్లు ఉద్యోగులకు సూచించాయి. దీంతో బుధవారం బ్రాంచ్‌ల్లో జరిగే సాధారణ బ్యాంకింగ్ సేవలన్నీ నిలిచిపోనున్నాయి. ఈ సమ్మె ప్రభావం ఏటీఎం సేవలపై కూడా చూపనున్నట్టు బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. నెఫ్ట్, ఐఎంపీఎస్, ఆర్‌టీజీఎస్ ట్రాన్స్‌ఫర్స్ వంటి నెట్‌బ్యాంకింగ్ సేవలు మాత్రమే ఈ స్ట్రయిక్‌కు ప్రభావితం కావు. స్ట్రయిక్ రోజు ఎలాంటి క్లరికల్ వర్క్‌ను చేపట్టవద్దని తమ సభ్యులను ఆదేశించినట్టు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫిడరేషన్(ఏఐబీఓసీ) జనరల్ సెక్రటరీ సౌమ్య దత్తా చెప్పారు. ఈ స్ట్రయిక్‌లోనే బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్లు జీతాల పెంపును డిమాండ్ చేయనున్నాయి. బ్యాంకింగ్ సంస్కరణలను, బ్యాంక్ విలీనాలను కూడా వ్యతిరేకిస్తున్నాయి.

