హోటల్‌‌లో రెబల్ ఎమ్మెల్యే బర్త్ డే వేడుకలు

హోటల్‌‌లో రెబల్ ఎమ్మెల్యే బర్త్ డే వేడుకలు

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం కంటిన్యూ అవుతోంది.  రెబల్ ఎమ్మెల్యేలకు నెలవుగా మారిన అస్సాంలోని గౌహతిలో ఉన్న రాడిసన్ బ్లూ హోటల్ పైనే ఇప్పుడందరి దృష్టి ఉంది. తాజాగా ఆదివారం శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే నరేంద్ర భోండేకర్ పుట్టిన రోజు వేడుకలు హోటల్ లో జరిగాయి. శివసేన నాయకుడు ఏక్ నాథ్ షిండే, ఇతర ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు. ఎమ్మెల్యే నరేంద్ర భోండేకర్ కు కేక్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 

మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీలో తమ బలాన్ని నిరూపించుకుంటామని షిండే వర్గం వాదిస్తోంది. రెబల్ ఎమ్మెల్యేలతో గౌహతి హోటల్ లో ఇవాళ 12 గంటలకు ఏక్ నాథ్ షిండే సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. 15 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వం ‘వై’ ప్లస్ క్యాటగిరీ సీఆర్పీఎఫ్ భద్రతను కల్పించిన సంగతి తెలిసిందే. ఏక్ నాథ్ షిండే కంచుకోట అయిన థానేలో మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధాజ్ఞలు  జారీ చేసింది. రాజకీయ సంక్షోభం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. జూన్ 30 వరకు  ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉండనున్నాయి.